కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొందరు ఉపాధ్యాయులు పని సమయాల్లో పాఠశాలలకు డుమ్మా కొడుతూ, బయట తిరుగుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు.
జిల్లా కలెక్టర్ సమయపాలనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, కొందరు ఉపాధ్యాయులు దీనిని పట్టించుకోవడం లేదని సమాచారం. పంచముఖి హనుమాన్ గుడి వద్ద గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి.
పాఠశాల పనివేళల్లో బయట తిరిగే ఉపాధ్యాయులు, మినిట్ బుక్లో కారణం నమోదు చేయకుండానే వెళ్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసింది. ఇలాంటి సంఘటనలు జిల్లా కేంద్రంలోనే జరుగుతుంటే, గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం FRS లో హాజరు నమోదు చేసుకుని, సాయంత్రం లాగౌట్ అవుతున్నారని, కొందరు ఉపాధ్యాయుల తీరుతో ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు వస్తుందని విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.











