తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2026 మొదటి విడత నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతి మంజూరు చేసింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ విడత నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో, నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది.
గతంలో జనవరి 2026లో చివరి టెట్ పరీక్షలు నిర్వహించగా, ఆ పరీక్షకు 1.95 లక్షల మంది హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, బీఎడ్, డీఎడ్ పూర్తి చేసినవారు, అలాగే ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు కూడా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంది. దీనివల్ల 2011కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలి.
ఏప్రిల్ సెషన్‌కు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో పరీక్షలు నిర్వహించడంపై కొందరు సూచనలు చేస్తున్నారు. టెట్ పరీక్షలో అర్హత సాధించడం డీఎస్సీ పరీక్షకు తప్పనిసరి. టెట్ అర్హతకు జీవితకాల వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు మెరుగైన స్కోర్ కోసం ఎన్నిసార్లు అయినా ఈ పరీక్ష రాయవచ్చు.
టెట్ పరీక్షలో అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40%గా నిర్ణయించబడ్డాయి.










