సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు ప్రేమపై రాసిన కవితా సంకలనం 'ప్రేమాక్షరి' త్వరలో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ విద్యార్థుల సాహిత్య ప్రయత్నాన్ని ప్రశంసించి, వారికి విలువైన సూచనలు అందించారు.
ప్రేమ, సృష్టి, బంధాలు, ప్రకృతి వంటి అంశాలపై విద్యార్థులు తమ భావాలను కవితాత్మకంగా 'ప్రేమాక్షరి' పుస్తకంలో పొందుపరుస్తున్నారు. ఈ పుస్తక రచనకు సంబంధించి విద్యార్థులు బుధవారం సుద్దాల అశోక్ తేజను ఆయన కార్యాలయంలో కలిసి, తమ రచనలను ఆయనతో పంచుకున్నారు.
విద్యార్థుల సాహిత్యాన్ని పరిశీలించిన సుద్దాల అశోక్ తేజ, వారి ప్రతిభను అభినందించారు. తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన రచనలు చేసినందుకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రచనల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై ఆయన విలువైన సూచనలు చేశారు.
విశ్వవిద్యాలయం విద్యార్థులను విద్యాబోధనతో పాటు సాహితీ రంగంలోనూ ప్రోత్సహించడం అభినందనీయమని అశోక్ తేజ పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్, జర్నలిజం విభాగాధిపతిని ఆయన అభినందించారు.
తన సొంత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, చిన్నతనంలో తనకు లభించిన ప్రోత్సాహం వల్లే తాను ఉన్నత స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొండూరి కోటిబాబు, అంజిబాబు నాగుల, ఎస్.దాసు, సిరిపురం సునేహా తదితరులు పాల్గొన్నారు.

