పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు అధైర్యపడవద్దని, ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారు సూచించారు. ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, తదుపరి విజయానికి తొలిమెట్టని ఆమె పేర్కొన్నారు.
పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న తరుణంలో, విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో వచ్చే మార్కులు జీవితాన్ని శాసించలేవని, ఫలితం ఏదైనా అది జీవితానికి ముగింపు కాదని, తదుపరి విజయానికి మొదటి మెట్టు మాత్రమేనని ఆమె తెలిపారు.
తల్లిదండ్రులను ఉద్దేశించి, పిల్లలను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చవద్దని, వారిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని ఆమె సూచించారు. ఫలితాల తర్వాత పిల్లలు మౌనంగా ఉన్నా లేదా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా, వెంటనే వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించాలని కోరారు.
ఓటమి అనేది తాత్కాలికమని, విద్యార్థులకు సిద్దిపేట జిల్లా పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని ఆమె భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఒంటరి కాదని, ధైర్యంగా ఉండాలని ఆమె తెలియజేశారు.
పరీక్షల్లో విఫలమయ్యామన్న బాధతో లేదా ఇతర కారణాల వల్ల ఎవరైనా మానసిక ఒత్తిడికి లోనవుతుంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్య ఏదైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని, సహాయం కోసం ఏ సమయంలోనైనా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. సహాయం కోసం 8712667100 లేదా డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.











