సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణం 23వ వార్డులో నివాసం లేక ఒంటరిగా జీవిస్తున్న అనాధ వృద్ధ మహిళ పరిస్థితిని స్థానికులు గుర్తించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించి ఆమెకు తక్షణ సాయం అందించారు. చలి తీవ్రత పెరుగుతున్న వేళ ఆమె ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. 23వ వార్డు మాజీ కౌన్సిలర్ కూన సంతోష్, టీవైఎస్ఎస్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కూన వేణు ఈ విషయాన్ని మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖకు తెలియజేయగా, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి వెంటనే స్పందించి ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్‌ను సంఘటన స్థలానికి పంపించారు. వృద్ధ మహిళ వివరాలు సేకరించిన అనంతరం ఆమెను అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న వృద్ధుల అనాధ ఆశ్రమానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం, భోజనం మరియు అవసరమైన సంరక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కూన సంతోష్, టీవైఎస్ఎస్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కూన వేణు తదితరులు ఉన్నారు.
సంగారెడ్డిలో అనాధ వృద్ధురాలికి అధికారుల అండ – ఆశ్రమంలో సురక్షిత ఆశ్రయం: జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి
Published On: November 20, 2025 5:33 pm