ఎన్నికల సంఘం పిలుపు… ఢిల్లీకి కేటీఆర్ బృందం
ఆగస్టు 5న ఈసీఐ సమావేశానికి హాజరుకానున్న బీఆర్ఎస్
కేటీఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లనున్న ప్రతినిధి బృందం
ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై చర్చ
బీఆర్ఎస్ పెండింగ్ వినతులపైనా చర్చించే అవకాశం
ఓటర్ల జాబితా సవరణ వివాదం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో పాల్గొనేందుకు ఈ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. రాజకీయ పార్టీలతో ఈసీఐ నిర్వహించనున్న ఈ భేటీ ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరగనుంది.
ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్ అధికారికంగా లేఖ పంపారు. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడికి సమాచారం అందించారు. కేటీఆర్ నాయకత్వంలోని ఈ బృందంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండనున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, వివిధ పార్టీలు సమర్పించిన వినతులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన వినతులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) డ్రైవ్‌పై వివాదం నడుస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం. ఇదే అంశంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తూ, చర్చకు పట్టుబడుతున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై ఆగస్టు 5న బెంగళూరులో నిరసన చేపట్టనున్నారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ బృందం ఈసీఐ సమావేశానికి హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.