Site icon PRASHNA AYUDHAM

సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల పోరాటం: సెప్టెంబర్ 1న ‘సీపీఎస్ విద్రోహ దినం’

IMG 20250825 WA0027

సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల పోరాటం: సెప్టెంబర్ 1న ‘సీపీఎస్ విద్రోహ దినం’

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 25

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) పిలుపు మేరకు, సెప్టెంబర్ 1న ‘సీపీఎస్ విద్రోహ దినం’ నిర్వహించాలని మెడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు నిర్ణయించారు.

జిల్లా అధ్యక్షులు, టీజేఏసీ ఛైర్మన్ బి. రవి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ విషయంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగుల భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్న సీపీఎస్ విధానం అన్యాయమైనదని, ఇది ఉద్యోగుల న్యాయసమ్మతమైన హక్కును కాలరాస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీ తప్పితే తీవ్రమైన ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

సెప్టెంబర్ 1న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపాలని, అనంతరం జరిగే సాధన పోరాట మహాధర్నాలో శక్తివంతంగా పాల్గొనాలని టీజేఏసీ నాయకులు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. పురుషులు నల్ల షర్టులు, మహిళలు నల్ల చీరలు లేదా చుడీదార్‌లు ధరించాలని సూచించారు. అదే రోజున హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణంలో జరిగే మహాసభను కూడా విజయవంతం చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించే వరకు తమ పోరాటం ఆగదని ఉద్యోగ నాయకులు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి భరత్ కుమార్, కలెక్టర్ యూనిట్ అధ్యక్షుడు నాగరాజ్, కార్యదర్శి కార్తీక్-కిషోర్, కోశాధికారి లింగాల అక్షయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి చంద్రకాంత్, ప్రచార కార్యదర్శి ఉమాకాంత్, కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి, ఆర్. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version