ఉపాధి హామీ నిధులు పెంచాలి – మంత్రి సీతక్క
కేంద్ర నిధుల కోతలతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం
కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో మంగళ వారం నాడు సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల ఆశోక్ తో కలసి కేంద్ర మంత్రితో భేటీ అయి శాఖపరమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా, రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కేంద్రం 12 కోట్ల పని దినాలు మంజూరు చేసినప్పటికీ, ఈ సంవత్సరం కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేయడం గ్రామీణాభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధితో పాటు మౌలిక సదుపాయాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఉపాధిపై ఆంక్షలు లేకుండా నిధులను పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందచేశారు. సీతక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.