సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
ఒక బట్టల వ్యాపారి తమ దుస్తులపై నాగార్జున చిత్రాలను, పేరును వాడుకుంటున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, సదరు వ్యాపారిని ప్రశ్నించింది. నాగార్జున టీ-షర్టులను ఎలా అమ్ముతారని, ఆయన ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం ఎవరిచ్చారని వ్యాపారిని హైకోర్టు నిలదీసింది.
వ్యాపారి తరఫు న్యాయవాది, 'ది ఘోస్ట్' సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని, మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్‌తో తమకు ఒప్పందం ఉందని, నాగార్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.
అయితే, నాగార్జున తరఫు న్యాయవాది ఈ వాదనలను అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒప్పంద పత్రాలను సమర్పించలేదని, కోర్టుకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలు అసంపూర్ణంగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు, ఈ వ్యవహారంలో తమకు నాగార్జునతో గానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో గానీ ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని వ్యాపారి అంగీకరించారు.
దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ, ప్రత్యక్ష ఒప్పందం లేనప్పుడు టీ-షర్టులను విక్రయించే చట్టబద్ధత ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.











