తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సింగర్ మంగ్లీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. తనకు పాటలు తప్ప స్కామ్‌ల గురించి ఏమీ తెలియదని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా అంగీకరిస్తానని మంగ్లీ పేర్కొన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ తనకు బాగా తెలుసని ఆమె అన్నారు. గత నెల రోజులుగా తన కార్యక్రమాలు, రికార్డింగ్‌లు వదులుకున్నానని, ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు తాను అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చారు.
ఈ వ్యవహారంలో మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తామే బాధితులమని మంగ్లీ తరఫు న్యాయవాది వాదించారు.
న్యాయవాది మాట్లాడుతూ, నేరగాళ్లే బాధితులుగా పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారని, అసలు స్కామ్ చేసిన వారే మీడియా ముందుకు వచ్చి బాధితులుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 'సుభాక్షేత్ర బిజినెస్' అనే కంపెనీని స్థాపించి, దానికి ఎండీగా ఉన్నది మధు అని, ప్రస్తుతం బాధితుడిగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన వివరించారు.
ఈ స్కామ్‌కు సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఈ ఆరోపణల కారణంగా తన పనితీరుపై ప్రభావం పడుతోందని, తప్పుడు ప్రచారంతో తాను నలిగిపోతున్నానని మంగ్లీ పేర్కొన్నారు.











