కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై శ్రీ సరస్వతీ విద్యాలయం విద్యార్థులు నిర్వహించిన అవగాహన కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా దోమకొండ సర్పంచ్ ఐరిని నర్సయ్య విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించారు.
శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న చౌరస్తాలో శ్రీ సరస్వతీ విద్యాలయం విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నృత్య ప్రదర్శనల ద్వారా ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను, పర్యావరణ నష్టాలను విద్యార్థులు వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఐరిని నర్సయ్య మాట్లాడుతూ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వాడకాన్ని తగ్గించాలని, వేడి పదార్థాలను ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరం అని సర్పంచ్ హెచ్చరించారు. మార్కెట్కు వెళ్లేటప్పుడు పర్యావరణహితమైన సంచులను, స్టీల్ డబ్బాలను వాడాలని ఆయన సూచించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి వ్యాపారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పాఠశాల కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


