*మహిళ ఎస్సైగా రెండేళ్లు చలామణి*
* హైదరాబాద్ :జులై 06*
రాజస్థాన్ లోని సికర్ జిల్లా లో మూలీ దేవి, అలియాస్ మోనా అనే కిలాడి మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నకిలీ ధృవపత్రాలతో ఏకంగా రెండేళ్లు రాజస్థాన్ పోలీస్ అకాడమీ లో ఎస్సైగా చలామణి అయింది..
మోనా అనే మహిళ ఏకంగా పోలీసులనే బురిడీకొట్టించింది. సబ్ ఇన్‌స్పెక్టర్ గా సెలక్టైనట్లు నకిలీ పత్రాలు సృష్టించింది. పోలీస్ అకాడమీలో రెండేళ్ల పాటు ట్రైనింగ్ పొందింది. ఐపీఎస్ అధికారులతో కలిసి ఫొటోలు దిగింది. రీల్స్ చేసింది. ఏడీజీతో టెన్నిస్ ఆడింది. అయినా ఆమె నకిలీ అన్నది ఎవరూ గుర్తించలేదు. చివరకు మిగతా ట్రైనీలు అనుమా నం వ్యక్తం చేయడంతో ఆ మహిళ గుట్టురట్టయ్యింది.
రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. నాగౌర్ జిల్లాలోని నింబా కే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా, 2021లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. అయితే ‘మూలి దేవి’ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది.
సబ్ ఇన్‌స్పెక్టర్ గా ఎంపికై నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నది. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో ఆమె చేరింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ముందు బ్యాచ్‌కు చెందిన అభ్యర్థిగా పరిచయం చేసుకున్నది. రాజస్థాన్ పోలీస్ అకాడమీలోకి ప్రవేశించింది.
కాగా, మోనా బుగాలియా అలియాస్ మూలి దేవి రెండేళ్లపాటు రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్‌ఐగా శిక్షణ పొందింది. యూనిఫాంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కనిపించడం తోపాటు రిహార్సిల్స్‌లో పాల్గొన్నది.పోలీస్ అకాడమీలోని నిషేధిత ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా తిరిగింది. అయినా ఆమె నకిలీ ట్రైనీ ఎస్‌ఐ అన్నది ఎవరూ గుర్తించలేదు
మరోవైపు 2023లో కొంతమంది ట్రైనీ ఎస్‌ఐలు మోనా బుగాలియా గుర్తింపుపై అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్ పోలీస్ అధికారులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నకిలీ గుర్తింపుతో పోలీస్ అకాడమీలో ఎస్‌ఐగా ఆమె శిక్షణ పొందుతున్నట్లు బయటపడటంతో కేసు నమోదైంది.
కాగా, 2023 నుంచి పరారీలో ఉన్న మోనాను సికర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివసించిన అద్దె ఇంటిలో తనిఖీలు చేశారు. రూ.7 లక్షల నగదు, మూడు ప్రత్యేక పోలీసు యూనిఫా మ్స్, రాజస్థాన్ పోలీస్ అకాడమీకి చెందిన పరీక్షా పత్రాలు, తప్పుడు గుర్తింపు కోసం వినియోగించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.