*ఎక్కడున్నా ప్రజాసమస్యలపైనే మంత్రి లోకేష్ దృష్టి*
*నారావారిపల్లెలో 55వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్*
*ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరణ*
నారావారిపల్లెః ఎక్కడున్నా ప్రజాసమస్యల పరిష్కారంపైనే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. 55వ రోజు ప్రజాదర్బార్ లో వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మంత్రి లోకేష్ ను కలిసి అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
*రహదారి సౌకర్యం కల్పించండి*
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి తాలూకాలోని పెద్దమండ్యం, వెరిగల్లు, శివపురం గ్రామాల నుంచి మల్లయ్య కొండ కింద నేలమల్లయ్య స్వామి గుడి వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదని, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అటవీ ప్రాంతం కావడంతో ఆ శాఖ అధికారులు రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అనుమతులు త్వరతగతిన లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మల్లయ్య కొండ కింద తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని కోరారు.
*ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు* తనకు జన్మించిన కవల పిల్లలను 18 రోజుల పాటు ఇంక్యుబేటర్ లో పెట్టడంతో రూ.6లక్షల వరకు ఖర్చయ్యాయని, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం సత్యపురానికి చెందిన సి.లోకేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. తనపై అక్రమ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని తిరుపతి ఉప్పరపాళెంకు చెందిన కారుమంచి మధుసూదనరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిపై గోపి, శివ, గౌతమ్, సుమతి అనుచురులు మారణాయుధాలతో దాడిచేయడమే కాకుండా గొడవతో సంబంధం లేని తనను అక్రమంగా కేసులో ఇరికించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తనను అక్రమంగా రిమాండ్ కు పంపారని, విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతికి చెందిన అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గాండ్ల తెలికుల అభివృద్ధికి తిరుమలలో రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు గాండ్ల తెలికుల కార్పోరేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటుచేసి అవసరమైన నిధులు కేటాయించాలని, గాండ్ల తెలికులు ఉత్పత్తి చేసే నూనెలనే దేవాలయాల్లో, ప్రభుత్వ ఆహార ఉత్పత్తుల్లో వినియోగించాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19లో పనులు చేసిన తనకు వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులు నిలిపివేసిందని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా సంకేపల్లి మండలం పీఎన్ కాలనీకి చెందిన వై.గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఆరేపల్లి రంగంపేటకు చెందిన ఉమాది రెడ్డమ్మ విన్నవించారు. తిరుపతిలోని ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో సీనియర్ అసిస్టెంట్ గా రిటైర్డ్ అయిన తనకు మూడేళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదని, విచారించి తగిన న్యాయం చేయాలని ఎమ్.జయచంద్ర విజ్ఞప్తి చేశారు. పాసుపుస్తకాలు ఉన్న తమ అనుభవంలోని 2.50 ఎకరాల భూమిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇచ్చారని, వాటిని రద్దు చేసి తమ భూములను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నమయ్య జిల్లా మాధవరం గ్రామానికి చెందిన కే.రామనరసప్ప విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో మంచినీటి చెరువు నిర్మాణానికి సహకరించాలని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం బండారువారిపల్లెకు చెందిన గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.