మితిమీరిన మొబైల్​ వాడకం – ముప్పు తప్పదంటున్న నిపుణులు..!!

*మితిమీరిన మొబైల్​ వాడకం – ముప్పు తప్పదంటున్న నిపుణులు..సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడొద్దు అన్న మాటకి ఆత్మహత్య చేసుకున్నాడు ఒక బాలుడు…*

*సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. కుటుంబాల్లో చిచ్చు రేగుతున్నాయి…పిల్లల చదువులు కి తీవ్ర అంతరాయం…ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ, సైకాలజిస్టు, ఫ్యామిలీ కోచ్‌*

నేటి టెక్నాలజీ యుగంలో అందరూ ఎక్కువగా ఫోన్లను వాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేకపోవటం, పెద్దవారికి నిద్రలేమి సమస్యలు మొదలైనవి వెంటాడుతున్నాయి. దీంతో పాటు మితిమీరిన మొబైల్ వాడకంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చివరకు వీడియోగేమ్స్, ఇతర గేమ్స్​ మానవుల్లోని మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయని మానసిక వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఓ బాలుడికి చిన్ననాటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్య ఉంది. రూ.లక్షలు పోసి వైద్యం అందించారు. ఇటీవల తండ్రి ఓ సెల్​పోన్​ కొని ఇచ్చాడు. దీంతో చదువు పక్కనెట్టేసి దాంట్లోనే లీనమైపోయాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో పది రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతి గదిలో ఫోన్‌ వాడుతుండగా దానిని తీసుకున్నారని అధ్యాపకురాలిని చెప్పుతో కొట్టిందో విద్యార్థిని. ఇటీవల ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ ఘటన జరగడం గమనార్హం.

కుటుంబాల్లో చిచ్చురేపుతున్న సెల్​ఫోన్​: తన భర్త గంటల తరబడి సెల్​ఫోన్​తో గడుపుతున్నాడని, తనకు సమయం కేటాయించడం లేదని నగరానికి చెందిన ఓ మహిళ విడాకులు కోరింది. ఆ దంపతులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు. ఈ మూడే కాదు ఇంకా చాలా కుటుంబాల్లో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సెల్​ఫోన్లు రేపుతున్న చిచ్చుతో కొందరు రోడ్డున పడుతుండగా మరికొందరు ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు.

ఒకప్పుడు ఎంతో విలువైన ఉపయోగకరమైన ఈ సెల్​ఫోన్​ నేడు ప్రమాదకారిగా తయారయింది. జీవితాలను బలిగొంటోంది. అవసరం కంటే ఎక్కువ వినియోగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు, సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. కౌన్సెలింగుకు వచ్చే కేసుల్లో దాదాపు 70 శాతం వరకు మొబైల్ వాడకానికి సంబంధించినవేనని నగరానికి చెందిన మానసిక వైద్యుడు వెల్లడించారు.

చదువులకు తీవ్ర అంతరాయం: చదువుతో పాటు ప్రత్యేక కోర్సులు నేర్చుకునేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు, విజ్ఞానాన్ని మెరుగు పర్చుకునేందుకు సెల్​ఫోన్​ ఎంతో ఉపయోగపడుతుంది. చేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంది. కానీ మితిమీరిన వినియోగంతో కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కరోనా తరువాత చాలామంది విద్యార్థులు వాడడం ప్రారంభించారు. వీరిలో దాదాపు 45 శాతం మంది విద్యార్థులు చదువును పక్కనెట్టేశారని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది.

నమోదైన కేసులు: సెల్​ఫోన్ల కారణంగా గత నాలుగు నెలల్లో నమోదైన కేసులను గమనించినట్లయితే మనస్పర్థలతో స్టేషన్‌ మెట్లెక్కిన దంపతులు 80 మంది కాగా, ఇళ్ల నుంచి వెళ్లిపోయినవారు మరో 30 కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో చూసి గంజాయి, మద్యం తాగడం, దొంగతనాలకు పాల్పడిన కేసులైతే 16 గా నమోదయ్యాయి. మితిమీరి సెల్​ఫోన్​ వాడకంతో మనిషి ప్రవర్తనలో మార్పులు వచ్చిన కేసులు 45 నమోదు కావడం విశేషం. ఇక కంటి సమస్యల బారినపడిన వారి సంఖ్య కింద 120 కేసులు ఉన్నాయి. సెల్​ఫోన్​ వినియోగంతో చురుకుదనంగా లేకపోయిన వారి సంఖ్యగా 8 కేసులు నమోదు అయ్యాయి.

”మొబైల్‌ వినియోగంతో ఇబ్బంది ఉండదు. కానీ గంటల తరబడి వాడితే ముప్పు తప్పదు. మా వద్దకు వచ్చేవారిలో ఇలా ఉపయోగిస్తున్నవారే ఎక్కువ. బాలలు, విద్యార్థులకు ఇస్తే పక్కనే ఉండండి. వారేం చేస్తున్నారో గమనించండి. సమాచారం నిక్షిప్తమై, ఆఫ్‌లైన్‌లో పనిచేసే ట్యాబ్‌లను అందిస్తే మేలు. భార్యాభర్తలు సైతం మొబైల్‌కు దూరంగా ఉండాలి. అప్పుడే మంచి జీవితం ఉంటుంది. సామాజిక మాధ్యమాలను దూరం చేయాలి”-ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ, సైకాలజిస్టు, ఫ్యామిలీ కోచ్‌

Join WhatsApp

Join Now