ఎల్లారెడ్డి, అక్టోబర్ 14, (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ తాండ (4వ వార్డు) కు చెందిన ముడావత్ గణేష్ (48) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు గణేష్ డ్రైవర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.
నీటిలో కొట్టుమిట్టాడుతున్న గణేష్ ను గమనించిన ప్రత్యక్ష సాక్షులు వెంటనే వాహన తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బందికి సమాచారం అందించగా, హోమ్‌గార్డ్ ఆంజనేయులు (హెచ్.జి 46) చెరువులోకి దిగి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. కళ్లముందే ఒక వ్యక్తి నిస్సహాయంగా మునిగి చనిపోవడం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులను తీవ్రంగా కలచివేసింది.
శీతాకాలం కారణంగా చీకటి త్వరగా పడటంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదు. రేపు ఉదయం గాలింపు చర్యలు తిరిగి ప్రారంభించనున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. అదే విధంగా పై ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.