ఫడ్నవీసా?.. షిండేనా?.. మరికొన్ని గంటల్లో సస్పెన్స్‌కు తెర..!!*
మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరు?
నేడు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
ముంబై, నవంబర్ 25 : మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సస్పెన్స్‌కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు నెగ్గి విజయాన్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ఫడ్నవీస్?*
ప్రస్తుతం సీఎంగా ఉన్న శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండేనే కొంతకాలం కొనసాగించాలని, ఫడ్నవీస్‌ను జాతీయ రాజకీయాల్లోకి తెచ్చి జేపీ నడ్డా స్థానంలో పార్టీ అధ్యక్షుడిని చేయాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు. సీఎంగా ఉన్న షిండేను చూపిస్తూ ఎన్నికలకు వెళ్లి తీరా విజయం సాధించిన తర్వాత అతడిని పదవి నుంచి తప్పిస్తే అది కూటమికి నేతృత్వం వహంచిన బీజేపీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని, అతడిని ఆ పదవిలో కొనసాగిస్తే కచ్చితంగా బీజేపీ కూటమి ప్రతిష్ట మరింత పెరుగుతుందని, అధికారం కోసం బీజేపీ వెంపర్లాడదన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందని కొందరు నేతలు అంటున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి షిండే చేసిన కృషిని తక్కువ చేయలేమని, ఆయన 75కు పైగా బహిరంగ సభల్లో ప్రసంగించి ప్రచారం చేశారని, ఉద్ధవ్ ఠాక్రేను కాదని ప్రజలు శివసేన, కూటమి పార్టీలకు పట్టం కట్టారంటే అది షిండే చలవేనని వారు తెలిపారు. ‘బీజేపీ 100 సీట్లకు పైగా గెలిచినంత మాత్రాన పొత్తు ధర్మం మరచిపోతుందని నేను అనుకోవడం లేదు. కచ్చితంగా షిండేనే సీఎంగా కొనసాగించాలి. తిరిగి మహా సీఎంగా మేము అతడినే చూడాలని కోరుకుంటున్నాం’ అని శివసేన నేత ఒకరు పేర్కొన్నారు. బీహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ సీఎంగా నితీశ్‌నే కొనసాగిస్తున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మేము అధికారం కోసం ఎలాంటి బేరసారాలు చేయడం లేదు. కలిసి పోరాడాం, విజయం సాధించాం. గతంలో లాగే కలిసి పాలన సాగిస్తాం’ అని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు.
మూడు పార్టీల నిర్ణయమే శిరోధార్యం*
సీఎం పదవిపై కూటమిలోని మూడు పార్టీల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారని ఫడ్నవీస్ సైతం స్పష్టం చేశారు. ‘మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమిని నమ్మి అధికారం కట్టబెట్టారు. వారి తీర్పు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. కలిసి పోటీ చేసి విజయం సాధించిన మేము ఇప్పుడు సీఎం పదవి కోసం ఎలాంటి వివాదాలకు తావివ్వం. దీనిపై కూడా అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన అందరం దానిని శిరోధార్యంగా భావిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము 100కు పైగా సీట్లను సాధించామని చెప్పి కూటమిలోని పార్టీలను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు.
*స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం*
మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి నవంబర్ 26కన్నా ముందే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, మహారాష్ట్ర సీఎం పదవికి అజిత్ పవార్ పేరు కూడా ప్రస్తావనకు వస్తున్నప్పటికీ ఆయనకు ఎంతమాత్రం అవకాశాలు లేవని, ఆయనను డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెల్చుకున్నాయి.
*నేడు సీఎం ప్రమాణ స్వీకారం*
మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. తొలి విడుతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు వీరు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) పార్టీ నుంచి 12, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.