హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు
బాచుపల్లిలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ
సైబర్ క్రైమ్ పోలీసుల దాడి
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 9 మంది ముఠా సభ్యుల అరెస్టు
నకిలీ కాల్ సెంటర్ ద్వారా సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు నగరంలోని బాచుపల్లిలో ఒక విల్లాను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఆకస్మిక దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వివిధ క్రెడిట్ కార్డుల కంపెనీలకు అనుబంధంగా ఉండే ప్రముఖ చెల్లింపు వేదికలు (ప్లాట్‌ఫారమ్‌లు), ఆర్థిక సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను డానిష్ ఆలం, ఎండీ సాహెబ్ ఆలీ అలియాస్ సోను, ఎండీ ఫహాద్ పర్వేజ్, ఎండీ అమన్ ఆలం, ఎండీ ఇష్టియాక్ అహ్మద్, మహ్మద్ మొహసిన్, ఫరీద్ హుస్సేన్, ఎండీ షాదాబ్ ఆలం, ఎండీ సోనుగా పోలీసులు గుర్తించారు.
మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 22 మొబైల్ ఫోన్లు, పది ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్లు, కాల్ సెటప్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.