యూరియా కోసం రైతుల బారులు – తెలంగాణ రైతాంగం గోసలు

యూరియా కోసం రైతుల బారులు – తెలంగాణ రైతాంగం గోసలు

తెలంగాణలో యూరియా కోసం రైతులు క్యూల్లో బారులు తీరుతున్న దృశ్యం

ఎరువుల కోసం లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తింటున్న పరిస్థితి

ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన రైతుల వారసులు అవమానానికి గురవుతున్నారు

ప్రభుత్వాల నిర్లక్ష్యం – సమీక్షలు, ఆడంబరాలకే పరిమితమయ్యాయి

ఎరువుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతాంగం డిమాండ్

ప్రశ్న ఆయుధం సిద్దిపేట (ఆగస్టు 22):

రైతాంగం గోసలు మళ్ళీ తెలంగాణ ఉద్యమ దశలను గుర్తు చేస్తున్నాయి. పచ్చని పొలాల్లో పంటలు వాడిపోతున్నా, రైతులు మాత్రం యూరియా కోసం లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తింటున్నారు. స్వతంత్ర దేశంలో, స్వీయ పాలన కలిగిన రాష్ట్రంలో రైతులు ఈ స్థితికి చేరడం అవమానకరమని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

ఎన్నికల ముందు రైతు ఇళ్లకు వెళ్లి హామీలు ఇచ్చిన నాయకులు నేడు కనిపించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల మట్టిని ముద్దాడిన రైతుల చెమట వాసన పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని డివైఎఫ్ఐ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు ఆర్.అరవింద్ డిమాండ్ చేశారు.

“రైతులు పన్నులు కడుతున్నారు, జీఎస్టీ చెల్లిస్తున్నారు. కానీ యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, రైతులపై అన్యాయం” అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన తెలంగాణ రైతుల వారసులు నేడు అవమానానికి గురవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతులు కేవలం పంటలు పండించేవారు కాదు, దేశానికి అన్నదాతలని, వారి చెమటతో ఈ దేశం నిలుస్తుందని గుర్తు చేశారు.

“రైతుల ఆవేదన వినకపోతే చరిత్ర క్షమించదు. ఇప్పటికైనా ఎరువుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే తెలంగాణ రైతాంగం మళ్ళీ చరిత్ర సృష్టించడానికి వెనుకాడదు” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment