యూరియా కోసం రైతుల గోస – దోమకొండలో మూడు రోజులుగా పడిగాపులు
యూరియా కోసం సొసైటీ ఆఫీస్ వద్ద రైతుల బారులు
మూడు రోజులుగా వేచిచూసి నిరాశతో తిరిగిన కౌలు రైతులు
రాత్రి యూరియా వస్తుందన్న సమాచారం, కానీ సరఫరా లేక నిరాశ
ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేసిన ఆగ్రహంతో రైతులు
వెంటనే సరఫరా చేయకపోతే తీవ్ర ఆందోళనలు హెచ్చరిక
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22
దోమకొండ (కామారెడ్డి జిల్లా):
మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల గోస చెలరేగింది. గత మూడు రోజులుగా సొసైటీ ఆఫీస్ ఎదుట వందలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. సంగమేశ్వర్, అంచనూర్, సీతారాంపల్లి, లింగుపల్లి, కుట్టి ముక్కుల, అంబర్పేట్, ముత్యంపేట్ వంటి గ్రామాల నుండి వచ్చిన రైతులు ఎప్పుడు యూరియా వస్తుందా అని గంటల తరబడి వేచిచూశారు.
నిన్న రాత్రి యూరియా సరఫరా జరిగిందన్న వార్తతో రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నా, చివరికి వారికి నిరాశే మిగిలింది. ఎవరికీ యూరియా అందకపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
“పంటలు ఎండిపోతున్నాయి, అయినా ప్రభుత్వం సమయానికి యూరియా ఇవ్వడం లేదు” అని రైతులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా వెంటనే ఎరువును అందుబాటులో పెట్టాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.