*పాలకుర్తిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులకు పెండింగ్ నిధులు కేటాయించి, పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి*
*సాగునీరు అందక వరి పంటలు ఎండిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఎకరాకు 50వేల వరకు నష్టపరిహారం అందించాలి*
*ఎకరాకు 50వేల నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 13న జిల్లా కలెక్టరేట్ ల ముట్టడి*
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ*
పాలకుర్తిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీతో కలిసి పరిశీలించారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు నత్తనడక సాగుతున్నాయని, పాలకులు నీళ్లు అందిస్తామని మోసం చేస్తున్నారని, నిర్మాణ పనుల పేరుతో కట్టను తెంపడంతో రైతులకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న స్టేషన్ ఘన్ పూర్ పర్యటనకు వచ్చే ముందే రిజర్వాయర్ పనులకు పెండింగ్ నిధులు కేటాయించాలని కోరారు. రిజర్వాయర్ పనులు పూర్తి అయితే 7,500 ఎకరాలకు సాగు మీరు అందుతుందని, దీనిపై ప్రభుత్వం ప్రతేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ప్రాంతంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఎకరాకు 30వేల నుండి 50వేల వరకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్చి నెలలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన 2లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 12వేలు, మహిళలకు 2500, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, దళిత, గిరిజన కుటుంబాలకు 12లక్షల ఆర్థిక సహాయం వంటి హామీలపై వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు కేటాయించేలా గ్రామ గ్రామాన సర్వే నిర్వహించి, వచ్చే బడ్జెట్ లో కేటాయింపుకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను సిపిఎం పార్టీ గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు సాగునీరు అందాకపోవడంతో జనగామ జిల్లాలో 40% పంటలు ఎండిపోయాయని, రైతులకు ఎకరాకు 50వేల నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 13న జిల్లా కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పాలకుర్తిలో అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా రాజీవ్ చౌరస్తాలోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, జనగాం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, జిల్లా నాయకులు సోమసత్యం, చిట్యాల సోమన్న, సోమ అశోక్, తదితరులు పాల్గొన్నారు.