రైతులు పండించిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలి
–జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం, నవంబర్ 19, కామారెడ్డి :
రైతులు పండించిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్ సెంటర్, సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యంను ప్రతీ రైతు నుండి కొనుగోలు చేయాలనీ, ధాన్యం తేమ శాతం పరిశీలించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యంను తూకం వేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయాలని, రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం సబ్ సెంటర్ ను పరిశీలించి రోగులకు అందిస్తున్న ఇన్ పేషెంట్ రిజిస్టర్ లను నిర్వహించాలని తెలిపారు. నాణ్యమైన చికిత్సలు అందించాలని వైద్యులకు తెలిపారు. అనంతరం సమగ్ర ఇంటింటి సర్వే తీరును పరిశీలించి ప్రతీ యొక్క కుటుంబంలోని వ్యక్తుల వివరాలను సేకరించి పక్కాగా నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, సంజయ్ రావు, మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.