*_రైతుల కోసం 131 రోజుల పాటు నిరాహార దీక్ష…!!_*
ఆయనొక రైతు.. రైతు నేత.. రైతులకు మద్దతు ధర కావాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చున్నారు. తాము పండించే పంటలకు మద్దతు ధర లేకపోతే రైతు నష్టపోతున్నాడు అనేది ఆయన ఆవేదన.
దాంతో రైతుల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక‍్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వాల నుంచి స్పందన కనిపించలేదు. అంతే తాను నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. సుమారు నాలుగు నెలలకు పైగా నిరాహార దీక్ష చేసి కేంద్ర పెద్దల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. చివరకు కేంద్ర మంత్రులు ఆయనకు హామీ ఇవ్వడంతో తన 131 రోజుల నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.
జగజ్జీత్ సింగ్ దల్లేవాల్.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు. రైతు నాయకుడు కూడా. రైతులకు మద్దతు ధరతో పాటు అనేక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు ప్రేమికుడు. రైతు సమస్యలకు ముగింపు పడటం లేదని, మరీ ముఖ్యంగా మద్దతు ధర ఉండటం లేదని ఆందోళన చేపట్టి రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. రైతులు కలిసి నడిచి ఆయన.. చివరకు గతేడాది నవంబర్ 26వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
అప్పట్నుంచి నేటి వరకూ అదే పంతంతో కూర్చున్నారు. అయితే రైతు సమస్యలను కేంద్ర చర్చిస్తోందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టులు ఆయనకు హామీ ఇచ్చారు. దీక్షను విరమించాలని, ఆరోగ్యం బాగా క్షీణించిందని వారు పదే పదే విజ‍్క్షప్తులు చేసి, హామీ ఇవ్వడంతో జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఈ క్రమంలోనే దల్లేవాల్ మాట్లాడుతూ.. ‘ మీరంతా నన్ను దీక్ష విరమించమని కోరుతున్నారు. మా ఆందోళనను గుర్తించినందకు మీకు ధన్యవాదాలు. మీ సెంటిమెంట్స్ ను నేను గౌరవిస్తున్నారు. మీ ఆదేశాలను నేను పాటిస్తాను’ అని పేర్కొన్నారు.
రైతు సమస్యలపై ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశాం
రైతు సమస్యలపై మాట్లాడటానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసిన విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్.. ఎక్స్ వేదికగా తెలిపారు. రైతు నాయకుల డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా మేము కూడా అదే పనిలో ఉన్నాం. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాం. అందుచేతు ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించాలని కోరాం. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యవంతుడవ్వాలని ఆశిస్తున్నాను. రైతు ప్రతినిధులతో మేము మాట్లాడటానికి ఒక తేదీ ఇప్పటికే ఫిక్స్ చేశాం. మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు రైతుల తరఫున వచ్చే ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించాం’ అని చౌహాన్ పేర్కొన్నారు.