కొడుకును హత్య చేసిన తండ్రి
– కామారెడ్డి ఎ.ఎస్.పి. చైతన్య రెడ్డి,
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ఉద్దేశం ప్రకారమే వడ్ల భాస్కర్ తన కొడుకు నిఖిల్ ( 24 )
హత్య చేసినట్లు కామారెడ్డి ఏఎస్పీ బి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన రాళ్లపల్లి ప్రసన్న తేదీ 19.05.2025న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదైందన్నారు. ఫిర్యాదు ప్రకారం, ఫిర్యాదురాలి తమ్ముడు కామారెడ్డి మున్సిపాలిటీలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ ఉద్యోగం లేకుండా తిరుగుతూ, మద్యానికి బానిసై, డబ్బుల కోసం తన తల్లిదండ్రులను రోజూ శారీరకంగా మానసికంగా హింసించేవాడనీ, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో తన కొడుకు నిఖిల్ బ్రతికే ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని భావించిన తండ్రి వడ్ల భాస్కర్ అతనిని హత్య చేయాలనే ఉద్దేశంతో పథకం వేసినాడు. తేది 18.05.2025 రాత్రి 11:30 గంటల సమయంలో, నిఖిల్ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం గొడవపడి ఇంటి వస్తువులను ధ్వంసం చేయగా, తన ప్లాన్లో భాగంగా భాస్కర్ అతనిపై కట్టితో దాడి చేశాడు. అనంతరం 19.05.2025 ఉదయం 5:30 గంటలకు నిఖిల్ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, ఇనుప రాడ్తో తలపై, కాళ్లపై తీవ్రంగా కొట్టి హత్య చేసి పారిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడినది. ఈ కేసులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి ఎ.ఎస్.పి. చైతన్య రెడ్డి, ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడినది. బుధవారం తేది 21.05.2025 ఉదయం 10:30 గంటల సమయంలో, కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద నిఖిల్ను హత్య చేసిన నిందితుడు వడ్ల భాస్కర్ తిరుగాడుచుండగా, దర్యాప్తు బృందం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకోగా, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలు గల చొక్కా మరియు నోకియా మొబైల్ ఫోన్ను చూపించాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొని మర్డర్ కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ ఎస్. రామన్ ని, దేవునిపల్లి ఎస్సై జి.రాజు, మరియు క్రైం టీం సిబ్బందిని, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్, అభినందించారన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు ఉపేక్ష లేదని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, నిందితునికి తగిన శిక్ష పడేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాము అన్నారు.