Headlines:
-
మహిళలపై లైంగిక హింస: గతం నుంచి ప్రస్తుతానికి
-
పల్లవి కథ: భర్తకు లైంగిక వేధన కారణంగా ఎదురైన మానసిక కష్టాలు
-
రియా అనుభవం: చర్చికి వెళ్ళినప్పుడు ఎదురైన ప్రమాదం
-
మహిళల మానసిక ఆరోగ్యంపై లైంగిక హింస ప్రభావం
-
నిపుణుల మాటలు: ఆరోగ్యం దెబ్బతినడంలో ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత
ఏళ్లకు ఏళ్లు వెంటాడే భయాలు..!
ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకూ ఆమె తరచూ వివక్షకు, ఇక్కట్లకు, ఆంక్షల చెరసాలకూ బలవుతూనే ఉంది. తప్పు చేసిందని బహిష్కరించడం, చెట్టుకు కట్టేసి కొట్టడం, బట్టలు ఊడదీయడం వంటివి ఇప్పటికీ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఆమె ఆమెగా గౌరవం పొందే తరుణం కోసం దీర్ఘకాలం ప్రయాణం సాగించాల్సిందే! ఆమె రోజూ ఎదుర్కొనే హింసలో లైంగిక వేధింపుల అంశం ఎప్పుడూ ముందుపీఠినే ఉంటుంది. అలాంటి హింసతో నిత్యం సతమతమవుతూ మానసికంగా కుంగిపోతున్న కొంతమంది మహిళల అనుభవాలు, నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు చర్చించుకోవాల్సిన సందర్భం..
కేరళకి చెందిన 25 ఏళ్ల పల్లవి (పేరు మార్చాం.)కి పెళ్లయింది. భర్తతో ఆమె నిత్యం నరకం చూసింది. లైంగికంగా అతను ఎంతో వేధించాడు. ఆ ప్రభావం పల్లవి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అతని నుంచి విడిపోయినా ఆ గాయం ఆమెని వెంటాడుతోంది. ‘అతను చేసిన హింస వల్ల నా శరీరాన్ని నేను అసహ్యించుకున్నాను. హింసించుకున్నాను. చాలా కాలం నా మీద నాకే కోపం వచ్చేది. దీన్ని నుండి బయటికి రావడానికి నాకు చాలాకాలం పట్టింది’ అంటోంది.
ఇప్పటికీ అది గుర్తొస్తుంది..
23 ఏళ్ల రియా, తన స్నేహితురాలితో కలసి చర్చికి వెళుతోంది. అప్పుడు ఆమె కుర్తా ధరించింది. ఆ ప్రాంతమంతా జనసందోహంగా ఉంది. అక్కడే.. ఓ ఆకతాయి, ఆమె కుర్తాని వెనుకవైపు నుంచి పైకి ఎత్తాలని ప్రయత్నించి సఫలమయ్యాడు. ఆ క్షణం రియా భయంతో వణికిపోయింది. అతడ్ని పటు ్టకోవాలని చూసినా వాడు గుంపులో కలిసిపోయాడు. ఆ రోజు ఘటన నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ‘ఈ సంఘటన జరిగి చాలా కాలమైంది. అయినా ఇప్పడు కూడా నేను కుర్తా వేసుకున్నప్పుడల్లా వెనక్కి తిరిగిచూసుకుంటూ నడుస్తున్నాను. ఆ రోజు నేను పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు అనిపించింది. కానీ దాని తాలూకు భయం మాత్రం నన్ను వెంటాడుతోంది. ఇది ఎప్పటికి పోతుందో అర్థం కావడం లేదు’ అని ఆమె చెబుతోంది.
ఇంటర్వ్యూలో కూడా …
ముంబయికి చెందిన 22 ఏళ్ల మహిళా ఉద్యోగిని తన అనుభవాన్ని ఇలా షేర్ చేస్తోంది. ‘నేను ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు అక్కడ 40 ఏళ్ల విద్యావంతుడు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి అనుచితంగా తాకాడు. నేను వెంటనే వెనక్కి అడుగేశాను. నా అనుమతి లేకుండా ఎందుకు అలా చేశారని నిలదీశాను. నేను ఇంత ఆవేదనగా మాట్లాడుతుంటే అతను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు…’
మనదేశంలో …
భారత్‌తో సహా, వివిధ దేశాల్లో మహిళల మా నసిక ఆరోగ్యం దెబ్బతినడంలో లైంగిక హింస ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. 2021 అక్టోబరులో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, భారత్‌లో మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మహిళల్లో 39 శాతం మంది ఒత్తిడి వల్ల, 30 శాతం మంది ఆందోళన కారణంగా, మిగిలిన వారు లైంగిక హింస కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తేలింది.
లైంగిక హింస ఎదుర్కొని మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలకు చికిత్స అందించిన బెంగుళూరు హాస్పటల్ నర్సు మేఘా తన అనుభవాలను ఇలా చెబుతున్నారు…: ‘దాడికి గురై బతికిన వారు అనేక రకాల మానసిక భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. నిద్రలో ఉలిక్కి పడి లేవడం, అనుచిత ఆలోచనలతో సతమతమవ్వడం, నిద్ర పట్టకపోవడం, నిర్లిప్తత వంటివెన్నో వారిని వేధిస్తాయి. నవ్వడం, సంతోషంగా ఉండడంపై వారు ఎప్పుడూ ఆసక్తి చూపరు. నిద్రలోనే కాదు, ఆహారంలో కూడా విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా అధిక బరువు, బరువు కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. గుర్తింపు, ఆత్మగౌరవం పోయిందని బాధపడతారు’ అని మేఘ వివరించారు.
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
‘భారతీయ మహిళల్లో చాలామంది ఆరోగ్యానికి ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి పెద్దగా ప్రభావం చూపర’ని కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌స్ మాజీ డీన్, సైక్రియాట్రిస్ట్ ఆఫ్ రీసెర్చర్ డాక్టర్ షాజీ అంటున్నారు. ఒత్తిడి అనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైన మానసిక ఆరోగ్య సమస్య. ఈ సమస్య పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. ఆ వయసులో లైంగికంగా వారు ఎదుర్కొనే బాధాకరమైన అనుభవాలు ఈ దుర్బలత్వానికి దోహదం చేస్తున్నాయి. సాధారణంగానే ఆ వయసు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి, జీవవైవిధ్యం వారిని మరింత కుంగదీస్తుంది’.