తిమ్మాపూర్ గ్రామంలో ఫీవర్ సర్వే – డెంగ్యూ పరీక్షలు తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశం

తిమ్మాపూర్ గ్రామంలో ఫీవర్ సర్వే – డెంగ్యూ పరీక్షలు తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశం

అర్ఎంపీ రమేశ్ క్లినిక్ సీజ్ – క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఎం&హెచ్‌ఓకు ఆదేశం

డెంగ్యూ బారిన పడి మరణించిన శ్రావణ్, మహేష్ కుటుంబాలను కలెక్టర్ పరామర్శ

నీటి నిల్వలు, చెత్తాచెదారం తొలగించి ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రామపంచాయతీ అధికారులకు ఆదేశాలు

ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై కూడా మానిటరింగ్ తప్పనిసరి అని కలెక్టర్ హెచ్చరిక

ప్రశ్న ఆయుధం,జగదేవ్ పూర్ మండలం, ఆగస్టు 24:

తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ నివారణ చర్యలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే, హెల్త్ క్యాంప్‌ను తనిఖీ చేసి, జ్వరం ఉన్న ప్రతి ఒక్కరికి వెంటనే డెంగ్యూ పరీక్షలు చేసి, రిపోర్టులను టీ-హబ్‌కు పంపాలని వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చెత్తాచెదారం తొలగించాలని, పంచాయతీ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్ల వెంబడి నిల్వ నీరు, డ్రైనేజీలను తరచూ శుభ్రం చేసి, డ్రై డే, ఫాగింగ్, బ్లీచింగ్ కార్యక్రమాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.గ్రామంలో అక్రమంగా వైద్యం చేస్తున్న అర్ఎంపీ రమేశ్ క్లినిక్‌ను సీజ్ చేసి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఎం అండ్ హెచ్‌ఓకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ వైద్యులను పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.డెంగ్యూ బారిన పడి మరణించిన శ్రావణ్ (15), మహేష్ (35) కుటుంబాలను కలెక్టర్ పరామర్శించి, ఇతరులకు లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.

“ఆర్ఎంపీల వద్దకు వెళ్లకండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోండి. ప్రతి ఇంట్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి. రోజు కాచి చల్లార్చిన నీటిని తాగాలి” అని కలెక్టర్ గ్రామస్థులకు పిలుపునిచ్చారు.ఈ పరిశీలనలో డిపిఓ దేవకిదేవి, డీఎం అండ్ హెచ్‌ఓ ధనరాజ్, ఎంపీడీవో రామ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment