మధ్యతరగతికి ఆర్థిక సవాళ్లు

మధ్యతరగతికి ఆర్థిక సవాళ్లు

పడిపోతున్న ఆదాయాలు

పట్టణ వినిమయంపై తీవ్ర ప్రభావం

: భారత్‌లోని మధ్యతరగతికి ఆర్థిక సవాళ్లు పెరిగాయి. ఆదాయాలు తగ్గడంతో వారి వినిమయంపైనా ప్రభావం పడుతోంది. మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ నివేదిక ప్రకారం.. మధ్యతరగతిని ముఖ్యంగా మూడు సవాళ్లు వెంటాడుతున్నాయి. ఆర్థిక మందగమనానికి తోడు టెక్నాలజీ సమస్యలు, కుటుంబాల ఆదాయాలు క్షీణించడం. ఒకప్పుడు ఉపాధి పొందడంలో అత్యంత కీలకంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఆటోమేషన్‌, ఇతర సాంకేతికతతో ఆ వర్గం వారికి ఉద్యోగాలను లేకుండా చేస్తోంది. అదే విధంగా కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లోనూ క్లరికల్‌, సూపర్‌వైజరీ పోస్టులు తగ్గాయి.

”అవుట్‌సోర్సింగ్‌, ఆటోమేషన్‌ వాటితో ఖర్చు తగ్గించే చర్యల కారణంగా అనేక మేనేజర్‌ స్థాయి పోస్టులు అదృశ్యమవుతున్నాయి. ఎఐతో కొన్ని ఉద్యోగాలు పోతున్నాయని ఇటీవల విప్రో ఛైర్మన్‌ ప్రేమ్‌జీ వ్యాఖ్యలే నిదర్శనం. వైట్‌కాలర్‌ ఉద్యోగాల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయి.” అని నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ పిసి మోహనన్‌ పేర్కొన్నారు. కరోనా తర్వాత భారత వృద్థి మందగించింది. ఆర్థిక వ్యవస్త తిరోగమనంలోకి నెట్టబడింది. 2008 ఆర్థిక పతనం వంటి సంక్షోభం కాకపోయినప్పటికీ 2024-25 సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ ఆదాయాలు భారీగా తగ్గాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత క్షీణత. ఆర్థిక వ్యవస్థలలో ఇటువంటి తిరోగమనాలు సాధారణమే అయిప్పటికీ.. మధ్యతరగతిపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంది. వినియోగాన్ని భారీగా తగ్గిస్తుంది.

ఆర్‌బిఐ గణంకాల ప్రకారం.. గడిచిన 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జిడిపిలో కుటుంబాల పొదుపు భారీగా పడిపోయింది. పెరుగుతున్న గృహ రుణాల భారం పరిస్థితిని మరింత దిగజార్చింది. స్థూల పొదుపులు స్థిరంగా ఉన్నప్పటికీ, అన్‌సెక్యూర్డ్‌ రుణాలు పెరగడం నికర పొదుపులను దెబ్బతీస్తున్నాయి. తక్కువ ఆదాయాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మధ్యతరగతి ప్రజల వ్యయాలు తగ్గడంతో పట్టణ వినిమయం తగ్గిందని ఇటీవల నెస్లె ఇండియా ఎండి సురేష్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. మధ్యతరగతిలోని ప్రతికూల పరిస్థితుల వల్లే అమ్మకాలు పడిపోతున్నాయన్నారు. ఆహార పానీయాల రంగంలో రెండంకెల వృద్థి రేటు ఇప్పుడు 1.5 శాతం నుంచి 2 శాతానికి పడిపోయిందని నారాయణన్‌ తెలిపారు. ఇదే తరహాలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సిఇఒ రోహిత్‌ జావా పేర్కొన్నారు. పట్టణ మార్కెట్లలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో వినిమయం తగ్గిందన్నారు. మొత్తం ఎఫ్ఎంసిజి కొనుగోళ్లలో మూడింటిలో రెండో వంతూ మధ్యతరగతి ప్రజలదే కావడం విశేషం. వచ్చే త్రైమాసికాల్లో ఈ తిరోగమనం కొంత తగ్గొచ్చని మార్సెల్లస్‌ రిపోర్ట్‌ పేర్కొంది. అయితే సాంకేతిక అంతరాయాలు, కుటుంబాల పొదుపులో మాత్రం ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment