తొలి ఉత్తమ విద్యార్థి ‘ ముక్తా సాళ్వే’
భారతదేశ చరిత్రలోనే వివక్షాపూరితమైన కులం మరియు లింగ భేదాలను బహిరంగంగా ప్రశ్నించి, దానికి అక్షర రూపం ఇఛ్చిన మొట్టమొదటి మహిళ ‘ముక్తా (బాయి) సాళ్వే’. ఈమె శివాజీ మరియు భాగన్ దంపతులకు 05.01.1840న పూణే సమీపంలోని ఒక గ్రామంలో జన్మించింది. బ్రిటిష్ వారి చెర నుంచి స్వాతంత్య్రం సాధించాలి అనే సంకల్పాన్ని మొదటగా సంకల్పించి, ఎంతో మంది పోరాట వీరులను తయారుచేసిన ఆధ్యాక్రాంతి గురు ‘లహుజి రఘోజీ సాళ్వే’ వస్తాద్ స్వయానా ఈమెకు పెదనాన్న.
అప్పటి కట్టుబాట్ల మూలంగా తల్లిదండ్రులు తమ అమ్మాయిలను ఆ పాఠశాలలకు పంపడానికి భయపడగా, లహుజి సాళ్వే వారినీ ఒప్పించడంతో పాటు, తన ఇంటి ఆణిముత్యం ముక్తా (బాయి) సాళ్వేను ఆ బాలికల పాఠశాలలో చేర్పించి అందరికి మార్గదర్శుడయ్యాడు. అంతేకాకుండా పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికి తగిన రక్షణ ఏర్పాట్లు కూడా చేశాడు. లహుజి కల్పించిన రక్షణ మూలంగా, ఆ తర్వాత ఫూలే దంపతులపై ఆగ్రవర్ణాలవారు కన్నెత్తి చూడడానికి కూడా భయపడంతో, వారు తమ సమాజకళ్యాణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగల్గారు.
బాలికల పాఠశాలలో చేరిన 8 మంది అమ్మాయిలలో ముక్తా సాళ్వే మొదటి విద్యార్థి. ఈమె పాఠశాలలో ప్రవేశం తీసుకోకముందే సమాజం అనే పుస్తకమును కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకొని రావడం వలన, పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆ విషయాన్నీ అక్షర రూపంలో నేర్చుకున్నది. ఇతర ఉన్నత కులాలతో పోలిస్తే తన కులం మరియు సంఘం పట్ల సమాజం ఎలా ప్రవర్తించబడుతుందనే పంథాను మార్చుకోవాలని నిశ్చయించుకుంది.
ఈమె నిమ్నవర్గాల దుస్థితి మరియు దాని నుండి ఉపశమనం పొందు మార్గాల గురించి ” మాంగ్ మహారాచి దుఃఖవిశాయి ” అనే పేరుతొ వ్యాసం రాసి, బడుగు బలహీన వర్గాలు మరియు స్త్రీలు ఎదుర్కొంటున్న అమానవీయ ఇబ్బందులు మరియు అప్పటి క్రూర సమాజ కట్టుబాట్లను కళ్ళకు కట్టినట్లు వివరించింది. దీని మొదటి భాగం 15.02.1855 లో రాగా, రెండవ భాగం 01.03.1855 లో “జ్ఞానోదయ” అను మరాఠీ పత్రికలో ప్రచురితం అయ్యింది.
ఆమె తన ఈ వ్యాసాన్ని భగవంతునితో మాట్లాడుతూ ప్రారంభిస్తుంది. ఓహ్ ! దేవుడా ! దయచేసి మాకు మా మతం ఏమిటో చెప్పండి? ఓ దేవా! నీ నిజమైన మతాన్ని మాకు బోధించు, దాని ప్రకారం మేమందరం మా జీవితాలను నడిపించగలం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గంకు మాత్రమే ప్రత్యేక హక్కులు పొంది, మిగిలిన వారికీ ఎలాంటి హక్కులు లేని మతం ఈ భూమి నుంచి అంతరించిపోవాలి అని, ఈ అధిపత్యవర్గాల వారు వారి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుటకు, ఇతరత్రా వాటికీ బలహీన వర్గాల భూములను ఆక్రమించి, భూములు లేకుండా చేసి మన జీవనాధారాన్ని దెబ్బకొట్టడంతో పాటు విద్య నుంచి దూరంచేసి, ఉపాధిలేక పేదరికంలో ఉండేటట్లు మన ప్రజలను తక్కువ స్థాయికి దిగజార్చి, జంతువులు కంటే హీనంగా చిత్రీకరించి, జీవించేటట్లు చేశారని అప్పటి వర్ణవ్యవస్థ, క్రూరసమాజ కట్టుబాట్లతో పడే బాధలను వివరించింది. పీష్వాల పరిపాలనలో పడే అమానవీయ బాధలను గురించి కూడా వివరించింది. మహిళల దుస్థితి గురించి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల మహిళలు శిశువులకు జన్మనిస్తున్నప్పుడు, వారి తలపై సరైన పైకప్పు (గృహం) కూడా ఉండదని, ఎండ, వాన మరియు చలిలో అవస్థలు పడుతున్నప్పుడు, జబ్బు వస్తే, వారికీ ఉచితంగా వైద్యం చేసేంత మానవత్వం ఉన్న వైద్యుడు మిలో ఎవరైనా, ఎప్పుడైనా ఉన్నారా? అని అధిపత్యవర్గాల వారిని నిలదీసింది.
ముక్తా తన వ్యాసంలో విద్యా యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడంతో పాటు అతిముఖ్యమైనది అని చెప్పింది.
‘’ ఓ మాంగ్ మహార్ కులస్తుల్లారా!, మీరు పేదవారు మరియు అనారోగ్యంతో ఉన్నారు. జ్ఞాన ఔషధం మాత్రమే మిమ్మల్ని నయంచేస్తుంది మరియు స్వస్థపరిస్తుంది. ఇది క్రూరమైన విశ్వాసాలు మరియు మూఢనమ్మకాలు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. మీరు నీతిమంతంగా మరియు నైతికంగా ఉంటారు. ఇది మీ దోపిడీని ఆపుతుంది. మిమ్మల్ని జంతువులలాగా చూసే వ్యక్తులు మీతో ఆలా ప్రవర్తించే ధైర్యం చేయరు. కావున దయచేసి కష్టపడి చదువుకోండి. చదువుకొని మంచి మనుషులుగా మారండి. కానీ నేను దీనిని కూడా నిరూపించలేను. ఉదాహరణకు మంచి చదువులు చదివిన వారు కూడా కొన్నిసార్లు చాలా చెడ్డ పనులు చేస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తారు.’’
అప్పటి పూణే అధికారి మేజర్ థామస్ క్యాండీ (బ్రిటిష్ ప్రభుత్వ అనువాదకుడు, విద్యావేత్త) ముక్తా యొక్క వ్యాసానికి ముగ్ధుడై, చాక్లెట్ లాంటి తీపి తినుభండారాలు ఇవ్వగా, ఆమె సున్నితంగా తిరస్కరించి, వాటి బదులుగా పుస్తకాలూ ఇవ్వండి, మా జీవితాలు మారుతాయి అని చెప్పగా, థామస్ క్యాండీతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అప్పటి పూణే కలెక్టర్ గారి భార్య కండ్లలో నుంచి అసువులు జారాయి. ఆ తర్వాత ఇరువురు, బ్రిటిష్ రాణి గారికి ఉత్తరంలో ముక్తా గురించి, ఆమె న్యాయమైన డిమాండ్స్ మొదలగు వాటి గురించి వివరిస్తూనే, బడుగు బలహీన మరియు బాలికల విద్య యొక్క ఆవశ్యకత గురించి, వాటి సదుపాయాల కల్పన గురించి వేడుకోవడం జరిగింది. తత్ఫలితంగా, బ్రిటిష్ వారు అప్పటి భారతదేశంలో అమలులో ఉన్న విద్యా వ్యవస్థలో ప్రక్షాళనకు పూనుకోవడం జరిగింది. ముక్తా సాళ్వే ముఖచిత్రంగా పాఠ్య పుస్తకాలు ప్రచురించాలని బొంబాయి విద్యా శాఖా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది భారతదేశ చరిత్రలోనే మొదటి సంఘటనగా కీర్తి ఘడించింది.
ఈమె ఏ పాఠశాలలో అయితే విద్యాభ్యాసం చేసిందో, అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరి బాలికల విద్యకై కృషిచేస్తూనే, మహాత్మా జ్యోతిబా ఫూలే యొక్క ‘సత్యశోధక సమాజ్’లో (1873 సెప్టెంబరు 24 ) క్రియాశీల పాత్రపోషిస్తూ, ఫూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకొనివెళ్ళే గురుతరభాధ్యతను కర్తవ్యనిష్ఠతో జీవితాంతం నిర్వహించింది.
ఆమె వ్యాసం అప్పట్లో విప్లవాత్మకమైనది. ఈ వ్యాసంలోని కొంత భాగం 1868 సంవత్సరంలో ఎన్.వి.జోషి యొక్క ” పూణే వర్నన్ ” (మరాఠీ పుస్తకం), సూసీ తారు & కే.లలిత యొక్క ” విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా: 100 బీసీ టు ప్రెజెంట్ ఇన్ 1991″ అను ఆంగ్ల పుస్తకంలో కుడా ప్రచురించడం జరిగింది. ప్రగతిశీల రచయితలూ అని పిలవబడే వారు ఆధిపత్య సంస్కృతి ప్రభావంతో ముక్తా సాళ్వే యొక్క సాహిత్య సహకారాన్ని విస్మరించారు అనేది సత్యం. అనేక సార్లు అనువదించబడిన ఘాటైన ఆమె వ్యాసం, దళిత సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది.
ఈమె వర్ణవ్యవస్థ ద్వారా బానిసలుగా ఉన్న ప్రజలను విముక్తి చేసే ఏకైక మార్గం విద్యా అని, ఇది కేవలం అక్షరాస్యతకు మాత్రమే పరిమితం కాదని, జ్ఞానాన్ని సేకరించడానికి ఉపయోగపడే సాధనం అని, బడుగు-బలహీన వర్గాలు మరియు స్త్రీలు తమకు మంచి భవిష్యత్తును సృష్ఠించడానికి విద్యా మాత్రమే సహాయపడుతుందని గట్టిగా నమ్మింది. ఈమె నమ్మకాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆచరించి చూపెట్టి, విద్యా అనే జ్ఞాన సముపార్జన ద్వారా భారతీయులందరీ మంచి భవిష్యత్తుకు మార్గమును ప్రధానం చేశాడనే సత్యాన్ని ఒప్పుకోకతప్పదు.
18వ శతాబ్దములో కేవలం 3 సంవత్సరాల పాఠశాల విద్యాభ్యాసం ద్వారా 14 సంవత్సరాల వయస్సులోనే వివక్ష మరియు అణచివేత లాంటి విస్తృత భావనలను అర్థం చేసుకొని, బలహీనవర్గాలపై ఆధిపత్య వర్గాలవారు చేస్తున్న క్రూరత్వాలను ప్రపంచానికి బహిర్గతం చేసి, విద్యా జ్ఞానమే అన్ని సమస్యలకు దివ్య ఔషధం అని మొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావురాలైన ముక్తా సాళ్వే 184వ జయంతి సందర్బంగా అందరికి నాణ్యమైన విద్యను అందించి, వారి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసి, ఆమె ఆశయాలను ముందుకు కొనసాగించాలని ఆశిద్దాం. శరణాత్.
గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ ,
రాష్ట్ర అధ్యక్షులు , మాంగ్ సమాజ్ తెలంగాణ
మొబైల్ నెంబర్ : 8106549807