Site icon PRASHNA AYUDHAM

“డబ్బు లేకే నాన్న చనిపోయారు”.. కన్నీటి పర్యంతమైన ఫిష్ వెంకట్ కూతురు…!!

IMG 20250719 WA1650

*”డబ్బు లేకే నాన్న చనిపోయారు”.. కన్నీటి పర్యంతమైన ఫిష్ వెంకట్ కూతురు*

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన తెలంగాణ యాస, హాస్యంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటుడు ఫిష్ వెంకట్ (ముంగిలంపల్లి వెంకటేశ్) , తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు వందకు పైగా చిత్రాలలో హాస్య, విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న ఆయన శుక్రవారం (జులై 18, 2025) రాత్రి తుది శ్వాస విడిచారు. కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలతో పోరాడిన ఆయనకు అవయవ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు. దీనికి దాదాపు రూ. 50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో, కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురుచూసింది. దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో చివరకు ఆయన మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు.

ఫిష్ వెంకట్ అంత్యక్రియలు శనివారం( జూలై 19, 2025) న హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోని హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. ఆయన పార్థివ దేహాన్ని సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టలో ఉన్న ఆయన నివాసం వద్ద ఉంచారు. అభిమానుల సందర్శన అనంతరం అంతిమయాత్ర కొనసాగించింది. ‘గబ్బర్ సింగ్’ టీమ్, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తామంతా ఒకే సినీ కళామతల్లి బిడ్డలం అని చెప్పుకునే వారు ఇప్పుడు కనీసం మృతదేహాన్ని చూడాడానికి కూడా రాలేరా.. అని ప్రశ్నిస్తున్నారు.

*మోసపూరిత ప్రచారంతో దెబ్బతిన్న సాయం..*

ఈ కష్టకాలంలో, ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి భావోద్వేగంతో మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబానికి ఎదురైన చేదు అనుభవాలను వివరించింది. హీరో రామ్ చరణ్ లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని, దీనివల్ల తమకు ఎవరూ సాయం చేయలేదని ఆమె వాపోయింది. ప్రభాస్ పీఏ నంటూ ఓ నకిలీ కాల్ వచ్చిందని, కిడ్నీ మార్పిడి ఖర్చు తాము భరిస్తామని చెప్పారని, కానీ అది మోసమని తర్వాత తెలిసిందని శ్రావంతి కన్నీటిపర్యంతమైంది. తమకు ఎవరైనా సాయం చేస్తారనే ఆశతో వచ్చిన ప్రతి ఫోన్ కాల్‌కు సమాధానం ఇచ్చామని, కానీ మోసపోయమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

*డబ్బు లేకపోవడం వల్లే నాన్నను కోల్పోయాం*

“నాన్నకు కిడ్నీ మార్పిడి జరిగి ఉంటే బతికేవారు. డబ్బు లేకపోవడం వల్లే నాన్నను కోల్పోయాం “అని స్రవంతి బోరున విలపించింది. ఈ మాటలు సినీ పరిశ్రమలో నిస్సహాయ స్థితిలో ఉన్న కళాకారుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు కూడగట్టుకున్న నటీనటులు తోటి కళాకారుడికి సాయం చేసేందుకు కూడా చేతులు రావడం లేదా.. అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పరిశ్రమ పెద్దలపై ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

*కొద్దిపాటి సాయం, పరామర్శకు కరువై..*

ఆర్థిక సహాయం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొందరు సినీ ప్రముఖులు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందించగా, విశ్వక్ సేన్ , జెట్టి ఫేమ్ కృష్ణ మానినేని కూడా తమవంతు సహాయం చేశారని స్రవంతి వెల్లడించింది. అలాగే, రామ్ చరణ్‌కు చెందిన క్లీంకార ఫౌండేషన్ నుంచి రూ. 25 వేల సాయం అందిందని కూడా ఆమె పేర్కొంది. అయితే, సరైన సమయంలో కిడ్నీ దాత దొరకకపోవడం, చికిత్సకు అవసరమైన పూర్తి నిధులు సమకూరకపోవడంతో తన తండ్రి పరిస్థితి విషమించి కన్నుమూశారని కన్నీటి పర్యంతం అయింది. నాన్న మరణించిన తర్వాత, తమను పరామర్శించేందుకు ‘గబ్బర్ సింగ్’ టీమ్ తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ రాలేదని ఆవేదన తెలిపింది. మా అన్న పిష్ వెంకట్ ఫ్యామిలీని అదుకునే విధంగా తమ వంతు సాయం అందిస్తామని గబ్బర్ సింగ్ టీం తెలిపింది.

తనదైన శైలిలో హాస్యంతో ప్రేక్షకుల మెప్పించిన ఫిష్ వెంకట్ లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీరనిది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ పెద్దలు దృష్టి సారించాలని కోరుకుందాం అని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు….

Exit mobile version