Site icon PRASHNA AYUDHAM

వరద ముంపు రైతుల ఆవేదన – పరిహారం కోసం రాస్తారోకో

IMG 20250922 143657

నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 22, (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మంజీరా పరివాహక ప్రాంతాల రైతులు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాల వలన ఉధృతంగా ప్రవహించిన వరదతో వందల ఎకరాల్లో పంటలు ముంపుకు గురై తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.

రాస్తారోకోలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ – ఇటీవల కురిసిన వర్షాలతో పంటలతో పాటు రహదారులు, ప్రాజెక్టులు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయని, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చి కూడా నష్టపరిహారం అంశాన్ని పట్టించుకోకపోవడం రైతుల నిరాశకు కారణమైందని అన్నారు. 20 రోజులు గడిచినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.

రెండు గంటలపాటు సాగిన రాస్తారోకో కారణంగా హైదరాబాద్–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పోలీసులు, ఆర్డిఓ జోక్యం చేసుకోవడంతో, వారం రోజుల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకుడు బొల్లి నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, రాజదాస్, జయరాజ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, ఆదిమూలం సతీష్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు రైతులతో కలిసి పాల్గొన్నారు.

Exit mobile version