పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి – అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాధిక గుప్తా, ఐఏఎస్, శుక్రవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జవహర్నగర్ మరియు బాలాజీ నగర్ పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్శనలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి, స్థానిక మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, మరియు విద్యా నాణ్యతపై సమీక్ష నిర్వహించారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో అదనపు మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ వంటి సౌకర్యాల అవసరాన్ని గుర్తించిన రాధిక గుప్తా, వాటి కోసం అవసరమైన అంచనాలను (ఎస్టిమేట్స్) సిద్ధం చేసి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదనంగా, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విభిన్న ల్యాబ్లను, ముఖ్యంగా ఏఆర్ మరియు వీఆర్ ల్యాబ్లను కూడా ఆమె పరిశీలించారు. విద్యా నాణ్యత మెరుగుదల కోసం ఆధునిక సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు.
“ప్రతి విద్యార్థికి సమానమైన మరియు ఆధునిక విద్యా వాతావరణం అందించడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యం. అందుకోసం అవసరమైన మౌలిక వసతులను సమయానుసారం పూర్తి చేయాలి,” అని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా పేర్కొన్నారు.