*తెలంగాణకు మరో 31ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు*
*జాబితాలో 10 నగరాలు, పట్టణాలు*
*మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కేంద్రం ఫోకస్!*
*ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం.. ఉపాధి అవకాశాలు*
తెలంగాణకు మరో 31 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు రానున్నాయి. రాష్ట్రంలో నగరాలుగా అభివృద్ధి చెందిన పలు పట్టణాలు.. వ్యాపారాలు, వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటి వరకు ఈ సదుపాయం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 10 నగరాల్లో 31 ఎఫ్‌ఎం స్టేషన్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర క్యాబినెట్ భేటీలో దేశవ్యాప్తంగా 234 నగరాల్లో 730 ఎఫ్‌ఎం స్టేషన్లకు ఆమోదం తెలపగా.. ఆ జాబితాలో తెలంగాణకు చెందిన 10 నగరాలున్నాయి.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎఫ్‌ఎం స్టేషన్లకు అవకాశం కల్పించింది. అయితే.. తెలంగాణలో మాత్రం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎఫ్‌ఎంకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం అందించడంతోపాటు.. ఉపాధి కల్పనకు ముందడుగు పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం వ్యాఖ్యానించారు.
ఈ నగరాలకు ఎఫ్‌ఎం
ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి వెనకబడిన నగరాలు/పట్టణాలకు కూడా ఎఫ్‌ఎం సేవలు అందనున్నాయి. ఈ ప్రాంతాలకు యాస్పిరేషనల్ డిస్ర్టిక్ట్స్ కేటగిరీలో మూడేసి చొప్పున ఎఫ్‌ఎం చానళ్లు మంజూరయ్యాయి. కరీంనగర్, ఖమ్మం నగరాలతోపాటు.. మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, రామగుండం, సూర్యాపేట ప్రాంతాలకూ మూడేసి ఎఫ్‌ఎం స్టేషన్లు రానున్నాయి. నిజామాబాద్ నగరానికి మాత్రం నాలుగు చానల్స్‌ను కేటాయించారు.