నాగారం రోడ్డు పనులపై మాజీ ఛైర్మన్ ఆగ్రహం
నాగారం రోడ్డు పనులు పూర్తి చేయాలని మాజీ ఛైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి డిమాండ్
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 29
నాగారం– యంనంపేట్ ప్రధాన రహదారి పనుల జాప్యంపై మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ఆలస్యం వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, అధికారుల నిర్లక్ష్యం ఇంకెంతకాలం అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సచివాలయంలో ఉన్నత అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగాధికారులను కలిసిన చంద్రారెడ్డి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలంబర్తి ఐఏఎస్‌కు సమస్యను వివరించారు. గడువు పూర్తయినా రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది ప్రజల పట్ల ఘోర అన్యాయమని, వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన ప్రధాన కార్యదర్శి, హెచ్ఆర్డిసిఎల్ ఎస్‌సీకి ఫోన్ చేసి రెండు రోజుల్లో పనులపై సమీక్ష జరిపి, తక్షణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం చంద్రారెడ్డి హెచ్ఆర్డిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను కూడా కలిసి పనులు వేగవంతం చేయాలని గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, రామక్కపేట రవీందర్ రెడ్డి, కె. నాగరాజు తదితరులు ఆయనతో కలిసి ఉన్నారు.