Site icon PRASHNA AYUDHAM

ఐదు లక్షల మందితో మాజీ సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభ..!

IMG 20250203 WA0062

ఐదు లక్షల మందితో మాజీ సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభ..!

* త్వరలోనే గజ్వేల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణ..!

* రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలే బిఆర్ఎస్ ఎజెండా అవుతాయా..!

* అపరచాణిక్యుడు రాజకీయ వేడిని పుట్టిస్తారా..!

*గజ్వేల్ , పిబ్రవరి 03,

కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు బిఆర్‌ఎస్‌ సిద్ధమవుతోందని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బిఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. “నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు.. తొందర్లోనే భారీ బహిరంగసభ పెడదాం..” అని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే భారీ బహిరంగ సభ నిర్వహణకు గులాబీ దళం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పరిపాలనా వైఫల్యమే అజెండాగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కేసీఆర్‌ ఆదేశాలతో బిఆర్ఎస్ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్‌.. “గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా.. ఎన్నో ప్రభుత్వాలను చూశా కానీ, ఇలాంటి సర్కారును ఎన్నడూ చూడలేదు.. ఏడాదిలోపే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది..” అని చెప్పిన విషయం తెలిసిందే.. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటివాటిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్‌ నిలదీస్తారని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవనెత్తుతారని చర్చించు కుంటున్నాయి. అపరచాణిక్యుడు మాజీ సీఎం కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడిని పుట్టిస్తారని బిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడగొడతారని, ప్రజలలో బిఆర్ఎస్ కు ఆదరణ పెరగడం తద్యమని బిఆర్ఎస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి.

Exit mobile version