రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల పోలీసులు నైపుణ్యాలు కోల్పోతున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు
రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు. ఏడాదిలోనే 2,945 కేసులు అంటే.. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని అన్నారు. 82 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటు అని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని అన్నారు.హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగు నెలల క్రితం విశ్రాంత బ్యాంకు మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య జంట హత్య, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య కేసులో కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని హరీశ్‌రావు తెలిపారు. రూ.10కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతం ఉందని అన్నారు. ఇది బిహార్ (39 శాతం) వంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని చెప్పారు. ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని, సోషల్‌మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారని, ఆఖరికి పేరు మరిచిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారని విమర్శించారు.ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం లా అండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీసు శాఖను వాడితే బాగుంటుందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గించడానికి మెరుగైన లా అండ్ అర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీసు శాఖకు బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖను బలోపేతం చేయాలని సూచించారు. చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని, వేగవంతమైన న్యాయాన్ని అందించాలని సూచించారు. అంతేకానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించుకోకూడదని చెప్పారు.