కోటగిరి వరద ముంపు గ్రామాల్లో మాజీ ఎంపీ బిబి పాటిల్ పర్యటన
ప్రశ్న ఆయుధం, ఆగస్టు 31
ఉమ్మడి కోటగిరి మండలంలోని వరద ముంపు గ్రామాల్లో మాజీ ఎంపీ బిబి పాటిల్ శనివారం పర్యటించారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మంజీరా వరదలు పోటెత్తడంతో కల్లూర్, కొడిచర్ల, పోతంగల్, హాంగర్గా, కారేగం, సుంకిని గ్రామాల్లోని వరి, సోయా తదితర పంటలు నీట మునిగి నష్టపోయినట్టు ఆయన ప్రత్యక్షంగా గమనించారు.ఈ సందర్భంగా బిబి పాటిల్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున ధర్నాలు, నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.అదే విధంగా వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.ఈ పర్యటనలో బాన్సువాడ బీజేపీ ఇంచార్జ్ ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, రుద్రూర్ మండల ఇంచార్జ్ హరిబాబు, పోతంగల్ మండల అధ్యక్షుడు బజరంగ్, మరకలే ప్రకాష్ పటేల్, నాగనాథ్ పటేల్, ఉత్తమ్ పటేల్, కపిల్ పటేల్, యోగేష్ పటేల్, మారుతి పటేల్, గజానని పటేల్, విజయ్ తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.