గొంగిడి త్రిష ప్రతిభ తెలంగాణకు గర్వ కారణం – మాజీ ఎంపీ నామ

*అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఘన విజయం పట్ల మాజీ ఎంపీ నామ హర్షం*

*గొంగిడి త్రిష ప్రతిభ తెలంగాణకు గర్వ కారణం – మాజీ ఎంపీ నామ*

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 02); అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించడం పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. భారత్ యువ క్రికెటర్లు ప్రదర్శించిన అసాధారణ ప్రతిభ, క్రీడాస్ఫూర్తి దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం వాసి గొంగిడి త్రిష అద్భుతంగా రాణించిందని, ఫైనల్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీయడం తో పాటు 44 పరుగులు చేసిన ఆమె ప్రదర్శన మన తెలంగాణకు గర్వకారణమని నామ నాగేశ్వరరావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా క్రికెట్‌ను మరింత ఎదిగించేందుకు త్రిష వంటి యువ క్రీడాకారిణులు ప్రేరణగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. భారత యువ మహిళా జట్టు వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడం యువ క్రీడాకారిణుల అంకితభావం, కోచింగ్‌ స్టాఫ్‌ కృషి, బీసీసీఐ సహాయ సహకారాలు ప్రశంసనీయమని నామ పేర్కొన్నారు. ఈ ఘన విజయం భారత క్రికెట్‌ అభివృద్ధిలో మైలురాయిగా నిలిచిపోతుందని, మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు మరింతగా ముందుకు రావాలని సూచించారు. యువ క్రీడాకారిణులకు మెరుగైన వనరులు, శిక్షణ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment