*భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి మజిలీ ముగిసింది..
* దిల్లీలోని నిగమ్ బోథ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. కేంద్రప్రభుత్వ అధికారలాంఛనాలతో మన్మోహన్ పార్థివదేహానికి అధికారులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ , ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ రాజు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సహా ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌తో పాటు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారంతా వరుసగా మన్మోహన్ పార్థివదేహానికి సైనిక లాంఛనాల నడుమ పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అనంతరం *మన్మోహన్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుష్పగుచ్ఛం సమర్పించి సెల్యూట్ చేశారు.* చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు త్రివిధ దళాధిపతులు మన్మోహన్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత గౌరవ వందనం చేసిన త్రివిధదళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలగించారు. మన్మోహన్ బంధువులు, మతపెద్దలతో పాటు *రాహుల్ గాంధీ పాడే మోస్తూ నిగమ్ బోధ్ ఘాట్ లో చితి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చితిని పేర్చి పార్థివదేహాన్ని దహనం చేశారు.