లింగంపేటలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం
63 చెరువుల్లో 16.95 లక్షల చేప పిల్లలు విడుదల
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18
లింగంపేట మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో నరేష్ ప్రారంభించారు. మండలంలోని 63 చెరువులకు గాను 16 లక్షల 95 వేల 690 చేప పిల్లలను ఆయా గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా డైరెక్టర్ బెస్త సాయిలు మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలంటే సంఘాలు బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేపల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసిన అనంతరం వాటి సంరక్షణ బాధ్యత పూర్తిగా సంఘాలదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.