రాచకొండ పోలీసుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత మెడికల్ క్యాంపులు – సీపీ సుధీర్ బాబు
అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రెండో విడత మెగా హెల్త్ క్యాంప్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 1
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఐపీఎస్ అన్నారు. శుక్రవారం అంబర్‌పేట్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌లో ఆయన మాట్లాడారు.రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్, మహేశ్వరం జోన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మే నెలలో మల్కాజిగిరి జోన్ సిబ్బందికి నిర్వహించిన హెల్త్ క్యాంప్ విజయవంతమైందని, ఈ క్యాంపు కూడా అలాగే పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ఉపయుక్తంగా నిలుస్తుందని సీపీ పేర్కొన్నారు.ఈ క్యాంపులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మెడికవర్, డా. ఐ అగర్వాల్, సౌజన్య డెంటల్ ఆసుపత్రుల వైద్య నిపుణులు సేవలందించారు. క్యాన్సర్ వ్యాధిపై డా. కల్పన అవగాహన కల్పించగా, గుండె సంబంధిత సమస్యలపై డా. సురేశ్ రెడ్డి అవగాహన మేళవించారు. మహిళా సిబ్బందికి క్యాన్సర్ నివారణ కోసం ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించబడినట్టు తెలిపారు. ఈ క్యాంపు రేపు కూడా కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ ఉషారాణి (విమెన్ సేఫ్టీ), డీసీపీ శ్రీనివాసులు (ట్రాఫిక్), డీసీపీ శ్యామ్ సుందర్ (సీఆర్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్), రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ కో-ఆర్డినేటర్ సావిత్రి, డాక్టర్లు సరిత, అచ్యుతరావు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు భద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.