*నేరేడ్‌మెట్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ – సిపి సుధీర్ బాబు ప్రారంభం*
మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 1
పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో మల్కాజిగిరి జోన్‌లోని నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా జరిగింది. ఈ శిబిరాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే అతిపెద్ద సంపదని ఆయన అన్నారు.
ఆర్కేఎస్సీ చైర్మన్ కూడా అయిన సుధీర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 300 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో మామోగ్రఫీ, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి అధునాతన పరీక్షలు నిర్వహించారు.
సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా, సౌజన్య దంత సంరక్షణ ఆసుపత్రులు దంత సంబంధిత పరికరాలు అందించాయి. డాక్టర్ కె.కల్పన రఘునాథ్ క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స మరియు జీవనశైలి మార్పులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి, ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాధిక నాథ్, ఆర్కేఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ సిపి సుధీర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.