గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు… గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు..!

గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు… గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు!

నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు

ఫోన్ కాల్‌తో పోలీసులు అప్రమత్తం

బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.. నకిలీ కాల్‌గా నిర్ధారణ

కాల్ చేసింది మద్యం షాపులో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం ఓ ఆగంతకుడు ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

హుటాహుటిన గడ్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ కాల్ అని నిర్ధారణకు వచ్చారు.

మరోవైపు, ఈ బెదిరింపు కాల్‌ను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు కొద్ది వ్యవధిలోనే నిందితుడి ఆచూకీని కనుగొన్నాయి. నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌గా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఈ బెదిరింపు కాల్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment