మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు: ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ అరెస్ట్
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం
ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
అగ్నిప్రమాదంలో కుట్ర కోణం ఉందని గుర్తించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన గౌతమ్ తేజ్‌ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని సోమవారం పలమనేరులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిత్తూరు న్యాయస్థానంలో హజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని జైలుకు తరలించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాధమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.