అక్రిడిటేషన్ జారీలో తీవ్ర అలసత్వం, ప్రజా పాలన అంటే ఇదేనా : గౌటి రామకృష్ణ

*అక్రిడిటేషన్ జారీలో తీవ్ర అలసత్వం, ప్రజా పాలన అంటే ఇదేనా : గౌటి రామకృష్ణ*

*మీడియా అకాడమీ, ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మండిపాటు*

*కొత్త కార్డుల జారీకి ఇంకెన్నాళ్లు కావాలి ?*

*జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధి ఎంత ? ఖర్చు చేసింది ఎంత ? మిగిలింది ఎంత ?*

*వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని టిజేఎస్ఎస్ డిమాండ్*

*కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్లు ఉన్నాయా లేక హాంఫట్ అయ్యాయా ?*

*అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ?*

*ప్రతి జిల్లాలో డిపిఆర్ఓ సమక్షంలో రాత పరీక్షలు నిర్వహించి జర్నలిస్టులకు శాశ్వత అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి*

*గత ప్రభుత్వంలో జర్నలిస్టులను నిర్లక్ష్యం చేశారనే ప్రభుత్వాన్ని మార్చాం*

*కొత్త ప్రెస్ అకాడమీ చైర్మన్ గత సర్కారు విధానాలను, అల్లం నారాయణ పద్ధతులనే కొనసాగిస్తున్నారా ?*

*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనూ జర్నలిస్టులకు ఆరోగ్య, భద్రత ఉద్యోగ భద్రత లేదు*

*పాత్రికేయుల సమస్యలు తీరేవరకు పోరాటం ఆగదు : తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం*

హైదరాబాద్, బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే అక్రెడిటేషన్ కార్డులు ఇంకా ఎంత కాలం పొడిగిస్తారని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం మండిపడింది. ఇప్పటికే అనేక దఫాలుగా 3 నెలల చొప్పున పొడిగించుకుంటూ కాలం వెళ్లదీశారు అని సంఘం ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని , మరోసారి పాత కార్డులను పొడిగించడం అంటే నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు హ్యాండ్ ఇవ్వడమే అని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమిచ్చే గుర్తింపు కార్డులు పక్కదారికి పట్టకుండా పటిష్ట ప్లాన్ సిద్ధం చేసి 2 నెలల్లో రాష్ట్రంలోని జర్నలిస్టు అందరికీ అందించాలని ఇప్పటికే ఎన్నో సార్లు ఐ అండ్ పిఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్’కి విజ్ఞప్తి చేశామన్నారు. అయినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఉన్న లోపభూయిష్టమైన విధివిధానాలను, కాంగ్రెస్ హయాంలో కఠినతరం చేస్తూ డిగ్రీ పాసైన వాళ్లకు డిపి ఆర్ఓల సమక్షంలో రాత పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ పద్ధతిలోనే అసలైన జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తే సరిపోయే దానికి నెలలు నెలలు పొడిగించుకుంటూ పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం , ప్రెస్ అకాడమీ చర్యలతో పాత్రికేయులు విస్మయం చెందుతున్నారని రామకృష్ణ అన్నారు.

గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రాజ్యం ఏలిన అల్లం నారాయణ జర్నలిస్టు వ్యవస్థను అధోగతి పాలు చేశారని, ఆనాటి సీఎం కెసిఆర్ జర్నలిస్టు సంక్షేమం కోసం ఇచ్చిన రూ.100 కోట్ల ఫండ్ ఏమైందో పాత్రికేయులకు వివరించాలన్నారు.

ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి రూ.100 కోట్లలో ఎంత డబ్బు ఉందో, ఇప్పటికీ ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం ద్వారా చెప్పాలని కోరారు. లేకుంటే ఏరి కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వంపై సమాజంలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధి పూర్తిగా పక్కదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది జర్నలిస్టులు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడం, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నా, ప్రెస్ అకాడమీ నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో జర్నలిస్టు మిత్రులు అర్థం చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, జర్నలిస్టుల బతుకుల్లో ఎలాంటి మార్పు తేలేకపోయిందని మండిపడ్డారు.

అనారోగ్యంతో ఆసుపత్రిల పాలైన జర్నలిస్టులకు కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆసుపత్రి ఖర్చులను పూర్తిగా తిరిగి అందించాలని ఒక మంత్రి కానీ, ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ, కమీషనర్ కానీ ఇప్పటివరకు ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రేవంత్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను పూర్తి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, ఇది ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

గడిచిన సంవత్సర కాలంలో కేవలం విధివిధానాలను ఖరారు చేయడానికి కూడా చేతకాకపోతే అధికార యంత్రాంగం ఏం పని చేస్తోందో ప్రజలకు, పాత్రికేయులకు అర్థం అవుతుందన్నారు.

జర్నలిజం ప్రవేశ విద్య అభ్యసించిన వారికి డిగ్రీ పాసైనవారికి జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి వ్యక్తికి వారి జిల్లా పరిధిలో ఉన్న డిపిఆర్వోల సమక్షంలో రాత పరీక్ష నిర్వహించి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో అక్రిడేషన్ కార్డులను అంగట్లో సరుకులను అమ్ముకున్నట్లు అమ్ముకుని , దుర్వినియోగం అవుతాయని హెచ్చరించారు. ఎలాంటి అర్హత లేని వాళ్లకు 20వేల నుండి 50 వేల వరకు అమ్ముకొని పత్రిక యజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయని జనరల్ సెక్రెటరీ గౌటి రామకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చిత్తశుద్ధి వైఖరితో అక్రిడేషన్ కార్డులను జారీ చేయడంతోపాటు వాళ్లకు జారీ చేసే హెల్త్ కార్డులు ప్రతి ఆసుపత్రిలో ఉపయోగపడే విధంగా ఇవ్వాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆసుపత్రి ఖర్చులను పూర్తిగా భరించాలని గౌటి రామకృష్ణ కోరారు.

Join WhatsApp

Join Now