*ఏపీలో టీడీపీ మహిళా నేతకు బిగ్ షాక్.. పార్టీ నుంచి గాయత్రి సస్పెండ్*
ఏపీలో తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం నేత సస్పెన్షన్ కలకలం రేపింది. తెలుగు మహిళ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సందిరెడ్డి గాయత్రిపై సోషల్ మీడియాలో ఆరోపణలతో పాటుగా పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున.. పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ‘పార్టీ నియమావళికి విరుద్దంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీమతి సందిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాము’ అని ప్రకటనలో తెలిపారు.
విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ప్రతి అంశంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే ఆ సోషల్ మీడియా కారణంగానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాల విషయంలో గాయత్రిపై పార్టీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.. ఈ సస్పెన్షన్ అంశంపై గాయత్రి స్పందించాల్సి ఉంది.