ఏపీ రాజధాని అమరావతిలో ఒకింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైకి అంతా బాగుందని చెబుతున్నా .. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కావొచ్చు.. లేదా.. రైతులను అదృశ్య శక్తులు రెచ్చగొడుతున్న తీరుతో కావొచ్చు.. ఏదేమైనా.. మలివిడత భూ సమీకరణ ప్రక్రియకు ఆపశోపాలు పడాల్సి వస్తోంది. రాజధానిని మరింత విస్తరించాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో 44 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించేందుకు రెడీ అయింది.
నూతనంగా తీసుకునే భూములలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు.. క్వాంటమ్ వ్యాలీని, స్పోర్ట్సు సిటీని, స్మార్ట్ సిటీని నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచన. తద్వారా రాజధాని అమరావతిని అంతర్జా తీయ స్థాయిలో నిలబెట్టాలని యోచిస్తున్నారు. ఈ నిర్మాణాలకు పోగా మిగిలిన భూమిని అబివృద్ధిచేసి రైతులకు తిరిగి ఇవ్వనున్నారు. అదేవిధంగా కొంత భూమిని విక్రయించి… సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కింద మరింతగా రాజధానిని అభివృద్ధి చేయనున్నారు.
ఈ క్రమంలోనే గురువారం నుంచి మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలో భూముల సమీకరణకు రెడీ అయ్యారు. రైతులతో కలిసి గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలలో రైతులు తీర్మానాలు చేసి.. తమ భూములను స్వచ్ఛందంగా రాజధానికి ఇస్తున్నట్టు ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇక్కడే సర్కారుకు ఇబ్బందులు వచ్చాయి. కొందరు రైతులు అనుకూలంగా ఉంటే.. మరికొం దరు రైతులు మాత్రం వ్యతిరేకించారు. మరోసారి వైసీపీ వస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.
తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని గ్యారెంటీ ఇవ్వాలంటూ.. మంత్రులను ప్రశ్నించారు. దీంతో నివ్వెర పోయిన.. మంత్రులు.. చంద్రబాబు హామీ ఉంటారని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మరికొందరు.. రైతులు, గతంలో భూములు తీసుకున్న రైతులకు ఇంకా న్యాయం చేయలేదని ప్రశ్నించారు. అందుకే తాము భూములు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మంత్రులు వారిని ఒప్పించేందుకు చాలానే ప్రయాస పడ్డారు.
ఇదిలావుంటే.. అసలు రాజదాని విషయంలో ఇప్పటి వరకు చంద్రబాబు మాత్రమే ప్రకటనలు చేస్తున్నా రు. రైతులను ఒప్పిస్తున్నారు. అయితే.. కూటమిపార్టీలు కూడా రాజధానిగా అమరావతిని గుర్తించిన నేపథ్యంలో వారికి కూడా బాధ్యత ఉంటుందని.. వారు కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాల ని సూచనలు వస్తున్నాయి. అప్పుడు రైతుల్లో ఉన్న భయాలు పోయి.. వారు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా చంద్రబాబు భుజాలపై వేసేసి చూస్తూ కూర్చోవడం కూడా సరికాదని అంటున్నారు.