*ఫిబ్రవరిలో మరో డీఎస్సీ!*
– హైదరాబాద్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో రాతపరీక్షలను నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసి ఏప్రిల్లో రాతపరీక్షలుండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు రాతపరీక్షలకు హాజరయ్యారు. డీఎస్సీ తుది కీ గురువారం విడుదలయ్యే అవకాశమున్నది.
త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి. ఈనెలలోనే నియామకాల ప్రక్రియను చేపట్టే అవకాశమున్నది. ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ, విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు. దాని ఆధారంగా కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ను రూపకల్పన చేస్తారు.