తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈనెల 26న ఈ పథకం ప్రారంభం కానుండగా.. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామగ్రిపై ప్రభుత్వం దృష్టిసారించింది.
మెుత్తం 4.16 లక్షల ఇండ్ల నిర్మాణానికి దాదాపుగా 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 68 లక్షల టన్నుల స్టీల్, 101 కోట్ల ఇటుకలు, 40.50 లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతాయని గృహ నిర్మాణశాఖ అంచనాలు రూపొందించింది.పథకం అమల్లో భాగంగా సర్కార్ మరో తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను సైతం ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా జిలాల్లో వాగులు, నదుల్లో రీచ్‌లను గుర్తించాల్సి ఉంది. సిమెంట్, స్టీల్ సరఫరాపైనా రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది.
వీటిని పెద్దమొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలున్నాయి. మొత్తంగా సిమెంట్ బస్తాను రూ.260కి, టన్ను స్టీల్‌ను రూ.54 వేల చొప్పున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించాలని ప్రణాళికలు రూపొందించింది.ఇండ్ల నిర్మాణంలో ప్రధానమైన ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇటుకల కొరత లేకుండా చూసేందుకు.. తెలంగాణలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి మూడు చొప్పున ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.