Site icon PRASHNA AYUDHAM

గల్ఫ్ అమరుల సభకు ప్రభుత్వం సన్నాహాలు

IMG 20250304 WA0053

గల్ఫ్ అమరుల సభకు ప్రభుత్వం సన్నాహాలు

◉ గల్ఫ్ మృతుల కుటుంబాలతో సహపంక్తి భోజనం చేయనున్న సీఎం

గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్ లో త్వరలో ‘గల్ఫ్ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.

చనిపోయిన వారిని స్మరించండి !  బ్రతికున్న వారి కోసం పోరాడండి ! అనే స్ఫూర్తితో గల్ఫ్ దేశాల్లో ఏ కారణంగా చనిపోయినా.. విధి నిర్వహణలో మరణం (ఆన్ డ్యూటీ డెత్) గా పరిగణించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం అందజేస్తున్నదని,  ఇది దేశ చరిత్రలోనే ప్రథమం అని అనిల్ ఈరవత్రి తెలిపారు.

భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని ‘గల్ఫ్ అమరులు’ గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ ‘గల్ఫ్ భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని  అనిల్ ఈరవత్రి తెలిపారు.

తన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సొమ్ము వారి ఖాతాలకు ఈనెల ఒకటిన జమ చేయించారని అనిల్ తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ… దురదృష్ట వశాత్తు గల్ఫ్ దేశాలలో అకాల మరణం చెందిన మన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని అనిల్ ఈరవత్రి తెలిపారు.

 

Exit mobile version