ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించేందుకు విద్యాశాఖ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, ఇంజినీర్లు, పీఎం శ్రీ పాఠశాలల హెడ్‌ మాస్టర్లతో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి, పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల అభ్యాస వాతావరణం మెరుగుపడేలా చూడాలని అధికారులు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు నైపుణ్య ఆధారిత బోధన అందించడానికి డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్మార్ట్ బోర్డులు ఏర్పాటు,స్పోర్ట్స్, ఆర్ట్స్, సాంస్కృతిక కార్యకలాపాలు ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధుల వినియోగించాలని అన్నారు. పనులు పూర్తయిన పాఠశాలల వివరాలు, ఇంకా కొనసాగుతున్న పనుల జాబితాను సంబంధిత అధికారులు సమర్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మంజూరు చేసిన టాయిలెట్ పనులు, వంటగది షెడ్లు, మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యం కోసం మరుగుదొడ్లు సక్రమంగా పని చేసేలా చూడాలని, పనుల నాణ్యతపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో దెబ్బతిన్న పాఠశాలల్లో మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలని, విద్యార్థుల భద్రతకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిసెంబర్ 25 లోగా అన్ని పనులు పూర్తి కావాలనే లక్ష్యంతో పని చేయాలని అన్నారు. చేసిన పనులకు హెచ్‌ఓడీల ద్వారా బిల్లుల సకాలంలో చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు భవితా సెంటర్ నమోదు ఆరోగ్య పరీక్షలు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో సానిటైజేషన్ గ్రాంట్, స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ సద్వినియోగం చేయాలని తెలిపారు. ప్రతి పని నాణ్యతతో, గడువు లోపల పూర్తవ్వాలని, పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని, ప్రతి వారానికి ఒకసారి ప్రగతి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని, మధ్యాహ్న భోజన వంట గదులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా మండల విద్యాధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఎ. ఎక్స్. ఎల్., ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రాజెక్టులో నమోదైన పాఠశాలలలో సమర్ధవంతంగా అమలు చేయాలని, ఉపాధ్యాయులు తమ ఆపారు గుర్తింపు కార్డులను తక్షణమే తీసుకోవాలనిసూచించారు. ఫిజిక్స్ వాలా ఖాన్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో అందిస్తున్న బోధన తీరును పర్యవేక్షించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని తెలిపారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భవిత సెంటర్ల ద్వారా విద్యార్థుల ఆరోగ్య ప్రొఫైల్ నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య స్థితి, బరువు, ఎత్తు, కంటి చూపు, హీమోగ్లోబిన్, సాధారణ ఆరోగ్య పరీక్షలు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయాలన్నారు. పాఠశాల వారీగా విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్‌లు నవీకరించబడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పిడి డిఆర్ డిఓ జ్యోతి, డిఈఓ వెంకటేశ్వర్లు, ఈడబ్ల్యూఐడిసి & పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు, ఏంఇఓలు, హెడ్‌మాస్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment