సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి రాంనగర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఇంటి వద్ద పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 136వ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయిరెడ్డిలు నెహ్రూ గారి దేశ సేవ, త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ పిల్లలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ..నవంబర్ 14 అంటే కేవలం బాలల దినోత్సవం మాత్రమే కాదు… ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం 9 సంవత్సరాలు అంటే 3,259 రోజులు—జైలు జీవితం గడిపిన పండిట్ నెహ్రూ త్యాగాల్ని గుర్తు చేసుకునే రోజు అని అన్నారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు.. ప్రాణాలిచ్చారు… మంచి పరిపాలన చేశారని తెలిపారు. అటువంటి కుటుంబంపై కొంతమంది రాజకీయ మూర్ఖులు అవివేకంగా విమర్శలు చేయడం ఎంతో బాధాకరం అని అన్నారు. బీహార్‌లో ప్రజలు ఓటేశారా..? లేక మిషన్లే ఓట్లు వేసాయా..? అర్థం కాని పరిస్థితి అని, కానీ రాహుల్ గాంధీ కోసం నా మనసులో ఒకటే మాట… బీహార్ పోతే పోయింది… కానీ ఈ దేశం క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల జీవన చరిత్రను ప్రతిబింబించేలా ప్రత్యేక డాన్స్, స్కిట్స్‌తో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెహ్రూ ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రజా ప్రాజెక్టుల రూపకల్పన, దేశ అభివృద్ధికి పునాది వేసిన ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటు వంటి అంశాలను కళాకారులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాంనగర్‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Published On: November 14, 2025 10:31 pm